రాష్ట్రపతి ఎన్నిక… మామూలుగా జరగాల్సిన ఓ ప్రక్రియ. సాధారణంగా ఈ ఎన్నిక ప్రభావం రాష్ట్రాల రాజకీయాలపై పెద్దగా ఉండదు. కానీ, ఈసారి ఎన్డీయే అభ్యర్థి కోవింద్ విషయానికి వచ్చేసరికి.. తెలుగు రాష్ట్రాల్లో సందడి బాగా ఎక్కువైపోయింది. భాజపా సర్కారుకు మద్దతు ప్రకటించడంలో ఎన్నడూ లేని ఒక పోటీ తత్వం, వెంపర్లాట, ఆతృత లాంటివి కనిపించాయి. అయితే, ఇవి కేవలం రాష్ట్రపతి ఎన్నికకు మాత్రమే పరిమితమౌతున్న పరిణామాలుగా చూడలేం. భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాలను మార్చే దిశగా పడుతున్న అడుగులుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల రూపు రేఖల్లో కొన్ని మార్పులు తప్పవన్నట్టుగానే కనిపిస్తున్నాయి!
2019లో భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదే విషయమై రాష్ట్ర భాజపా నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఎందుకంటే, స్థానికంగా కేసీఆర్ సర్కారుపై భాజపా నేతలు చాలా విమర్శలు చేశారు, పోటారాలూ సాగించారు. రాష్ట్రపతి అభ్యర్థి హైదరాబాద్ రావడం, కేసీఆర్ సర్కారు హడావుడీ హంగామా చూశాం. సరే.. దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధికి బాసటగా నిలిచేందుకే కోవింద్ కు మద్దతు ఇస్తున్నట్టు కేసీఆర్ సర్కారు చెప్పుకున్నా… ఇదే కార్యక్రమానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఆయన కూడా తెరాస వారితో సరదాగానే కనిపించారు. దీంతో ఇది కేవలం కేంద్రానికి సంబంధించిన వ్యవహారం కాదనేది అర్థమైపోతుంది. సో… భాజపా, తెరాసలు భాయ్ భాయ్ అనుకునేందుకు దాదాపు సిద్ధమే.
ఇప్పుడు, తెరాస – టీడీపీల గురించి మాట్లాడుకోవాలి. కోవింద్ కు మద్దతు ఇవ్వడం అనేది ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా టీడీపీకి అనివార్యం. ఇక్కడ తెరాసతో టీడీపీ కలిసి సాగడం అనేది ఉండదు. కానీ, ఇటీవలే ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి పనిచేయాలని ఢిల్లీలో నిర్ణయించుకున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో చంద్రులు ఇద్దరూ గతంలో లేని ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని టీ టీడీపీ నేతల్లో ఒకరిద్దరి మాట ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేస్తే తప్పేంటీ అని! ఇదే సందర్భంలో భాజపాతో పొత్తు తెంపేసుకుందాం అని కొంతమంది టీడీపీ నేతలు అంటున్నా… అలాంటి ఆలోచనలే వద్దన్నట్టుగా చంద్రబాబు సముదాయిస్తూ వస్తున్నారు.
సో.. ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ చూస్తే తెలంగాణలో తెరాస, టీడీపీ, భాజపాలు కలిసే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయి. తెరాసకి భాజపా కావాలి. టీడీపీకి భాజపా కావాలి. తెరాసతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీని వ్యతిరేకించాల్సిన అవసరం భాజపాకి లేదు. అదే విధంగా టీడీపీతో కొనసాగుతున్నంత మాత్రాన తెరాసను దూరం చేసుకోవాల్సిన పనీ భాజపాకి లేదు. పైగా, తెలంగాణలో సోలోగా భాజపా సాధించేది కూడా ఏమీ ఉండదు! ఈ పరిస్థితి మున్ముందు కూడా ఇలానే కొనసాగితే రేవంత్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, రాష్ట్రపతి ఎన్నికతో తెలుగు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజం పడిందనే చెప్పాలి.