సినిమా వాళ్లు, అందులోనూ స్టార్ హీరోలు సెన్సిటీవ్‌గా ఉంటారు. తెరపై ఏం చేసినా, చెయ్యాలనుకొన్నా, ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ‘ఇలా చేస్తే.. జనంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయి’ అనే లెక్కలు వాళ్లకు చాలా ఎక్కువ. అందుకే వాళ్లేం చేసినా ఓ లెక్క ఉంటుంది. అల్లు అర్జున్ ఇప్పుడు గాజు గ్లాసు పట్టుకోవడం కూడా ఓ లెక్క ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.
‘పుష్ష 2’ నుంచి టైటిల్ సాంగ్ ఇప్పుడు విడుదలైంది. పాట ఎలా ఉంది? అందులో బన్నీ ఎలా డాన్స్ చేశాడు? అనేదానికంటే బన్నీ చేతిలో ఉన్న గాజు గ్లాసు హైలెట్ అయ్యింది. పాటలో ఓ చోట బన్నీ గాజు గ్లాసు పట్టుకొని ఓ సిగ్నేచర్ స్టెప్ వేశాడు. ఆ స్టెప్ బాగా కుదిరింది కూడా. పవన్ జనసేన సింబల్ గాజు గ్లాసు. ఆ సింబల్ జనంలోకి చేరువ కావాలన్న ఉద్దేశంతో పవన్ తన ప్రతీ సినిమాలోనూ గాజు గ్లాసు వాడుతూ వచ్చాడు. ఈమధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్లో గాజు గురించిన ఓ డైలాగే ఉంది. ఇప్పుడు బన్నీ కూడా గాజు గ్లాసుతో దర్శనం ఇచ్చాడు.
మిగిలిన హీరోలు ఎవరు ఇలా చేసినా.. పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు. బన్నీ చేసేసరికి.. అందరి దృష్టీ దానిపై పడింది. ఆమధ్య బన్నీకీ, పవన్‌కి పెద్దగా రాపో ఉండేది కాదు. ‘చెప్పను బ్రదర్’ ఇన్సిడెంట్ ఇందుకు కారణం. అయితే అవసరం అనుకొన్న సందర్భంలో ఒకరినొకరు కలుసుకొని తమ సంఘీభావం వ్యక్తం చేసుకొన్నారు. ఇప్పుడు పవన్‌కు అలాంటి మోరల్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే బన్నీ చేతిలో కూడా గాజు గ్లాసు కనిపించింది. నిజానికి ఇవన్నీ పైకి చిన్న చిన్న విషయాల్లానే కనిపిస్తాయి. కానీ వాటి ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. బన్నీ చేతిలో గాజు గ్లాసు.. జనసేనకు ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ అనేది పవన్ అభిమానుల మాట.