హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలోకి మరో ప్రచార కాంట్రాక్ట్ వచ్చిచేరింది. తెలుగు రాష్ట్రాలలో ‘ప్రో కబడ్డీ’ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ను స్టార్ గ్రూప్ నియమించుకుంది. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టార్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, కబడ్డీ సిసలైన భారతీయ క్రీడ అని అన్నారు. ప్రో కబడ్డీ పుణ్యమా అని ఆ ఆటకు మళ్ళీ ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ ఆటకు తాను బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వీలైతే తానుకూడా ఒక జట్టును కొనుగోలు చేస్తానని చెప్పారు. స్పోర్ట్స్ కథాంశంతో ఒక సినిమా చేయాలనుందనికూడా అర్జున్ తెలిపారు.
క్రికెట్‌కు ఐపీఎల్ తరహాలోనే కబడ్డీకి ప్రో కబడ్డీ పేరుతో లీగ్‌ను స్టార్ గ్రూప్ ప్రారంభించింది. దీనికి లే పంగా అంటూ అమితాబ్ బచ్చన్ ప్రచార గీతాన్ని పాడటం, అభిషేక్ బచ్చన్ ఒక జట్టు(జైపూర్ పింక్ పాంథర్స్)ను కొనుగోలు చేయటంతో క్రేజ్ గణనీయంగా పెరిగింది. 2014లో జరిగిన మొదటి సీజన్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. రెండో సీజన్లో ‘తెలుగు టైటాన్స్’ పేరుతో తెలుగు జట్టుకూడా బరిలో దిగుతోంది.