ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్లో పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మామూలుగా అయితే… ఇది చాలా రొటీన్ వ్యవహారం. పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిన్న ట్వీట్ వెనుక చాలా మేటర్ ఉంది. చాలా ప్రాధాన్యం ఉంది.
ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీకీ, జన సైనికులకు అస్సలు పడడం లేదు. అల్లు అర్జున్ తెలిసి చేశాడో, తెలియక చేశాడో తెలీదు కానీ, కొన్ని వ్యవహారాలు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాయి. నంధ్యాలలో వైసీపీ తరపున ప్రచారానికి వెళ్లడం, ఆ గాయం మానుతుండగా ‘నచ్చితేనే వెళ్తా..’ అంటూ నోరు జారేయడం పవన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. దాంతో ఫ్యాన్ వార్ మొదలైపోయింది. ఆఖరికి జనసేన నేతలు కూడా బన్నీపై యుద్ధానికి కాలు దువ్వారు. ‘మెగా అభిమానులే లేకపోతే నువ్వెంత’ అనుకొనేంత స్థాయికి వెళ్లిపోయింది వ్యవహారం. ఇది ఇలానే కొనసాగడం అటు పవన్ కల్యాణ్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు హీరోలకూ మంచిది కాదు. బన్నీ సినిమా వచ్చినప్పుడు పవన్ ఫ్యాన్స్, పవన్ సినిమా వచ్చినప్పుడు బన్నీ ఫ్యాన్స్ కత్తికడితే… అది సినిమాకే నష్టం. ఇది ఏమాత్రం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఇలాంటి దశలో పవన్ పుట్టిన రోజు వచ్చింది. ఇప్పుడు బన్నీ కనీసం ట్విట్టర్లో కూడా పవన్‌కు శుభాకాంక్షలు చెప్పకపోతే, అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది.దాన్నే భూతద్దంలో చూపిస్తూ ఇరు వర్గాలూ మరింత రెచ్చిపోయేవారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బన్నీ తన వైపు నుంచి ఎలాంటి తప్పూ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ‘మా మధ్య గొడవల్లేవు’ అనే సంకేతాన్ని పరోక్షంగా పంపించాడు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో బన్నీ కాస్త వెనక్కి తగ్గినట్టే అనిపిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా కూల్ అయితే, ఈ గ్యాప్ మొత్తం క్లియర్ అయిపోతుంది.