గామి.. ఇప్పటి సినిమా కాదు. నాలుగేళ్ల క్రితం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు కాగిత విద్యాధర్. తను నమ్ముకున్న కాన్సెప్ట్ ఎలాగైనా ప్రేక్షకులకు చూపించాలని తన టీంతో కలసి పెద్ద సాహసమే చేశాడు. అయితే గొరిల్లా ఫిలిం మేకింగ్ పద్దతిలో సినిమాని తీయలేమనే సంగతి అర్ధమైపోయింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ కి వచ్చారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాన్సెప్ట్ నచ్చి క్రౌడ్ ఫండింగ్ కోసం మాట చేశాడు రెండేళ్ళ క్రితం. మొత్తానికి ఎన్నో సినిమా కష్టాలు దాటుకొని షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నారు. సినిమా చూసిన యూవీ క్రియేషన్స్ తన బ్యానర్ పై విడుదల ఒప్పందం కుదుర్చుకుంది. యువీ రాకతో గామి సరికొత్త హైప్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు. చాలా ఆసక్తికరంగా టీజర్ సాగింది. దీనిపై అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా స్పదించారు. ‘‘కొత్త కథలతోప్రేక్షకుల్ని అలరిస్తోన్న యూవీ క్రియేషన్స్కి నా అభినందనలు. ‘గామి’ గ్లిమ్స్ నాకెంతగానో నచ్చింది. యూనిట్ మొత్తానికి నా అభినందనలు. పరిశ్రమలోకి కొత్తతరం దర్శకులు రావడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్ తో గామికి మాట సాయం అందినట్లయింది. గామిలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రధారి. గామి మొదలైనప్పుడు విశ్వక్ సేన్ కి పెద్ద ఇమేజ్ లేదు. కానీ ఇప్పుడు విశ్వక్ సేన్ కి అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. ఈ ఫాలోయింగ్ కూడా గామికి కలిసొస్తుందనే చెప్పాలి.