ఒకప్పుడు ఓటీటీలే సినిమాలకు శ్రీరామరక్షగా కనిపించాయి. ఇప్పుడు ఓటీటీల వల్ల చిత్రసీమ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోందన్న భయం పట్టుకొంది. సినిమా విడుదలైన… మూడు వారాలకే ఓటీటీలకు వచ్చేస్తుంటే, ఇక థియేటర్లకు వచ్చేదెవరు? సినిమా చూసేదెవరు? అందుకే ఓటీటీలతో దూరం పాటించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఓటీటీలను పూర్తిగా దూరం పెట్టేసే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు.
`పక్కా కమర్షియల్` ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. `టికెట్లు రేట్లు తగ్గించడంతో పాటు. ఓటీటీలకు దూరంగా ఉండాలి. సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలో రాకుండా జాగ్రత్త పడాలి` అని నిర్మాతలకు ఆయన హితబోధ చేశారు. తనయుడు అల్లు అర్జున్ `ఎఫ్ 3`ని క్యూబ్‌లో చూస్తానంటే. తానే థియేటర్‌కి పంపానని… జనాలు థియేటర్లో సినిమా చూస్తేనే చిత్రసీమకు మనుగడ అని అరవింద్ వ్యాఖ్యానించారు. `ఆహా` అనే ఓటీటీ సంస్థ చేతిలో ఉన్నా – ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే… చిత్రసీమ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది వరకు శాటిలైట్ ఛానళ్లు చిత్రసీమ ఉనికిని ప్రశ్నించాయి. సినిమా విడుదలైన వంద రోజుల వరకూ టీవీల్లో ప్రసారం చేయకూడదన్న నిబంధన ఉండేది. దాన్ని చెరిపేసి… ఇష్టమొచ్చిన రీతిలో టీవీలకు అనుమతులు ఇచ్చారు. దాంతో కొంతకాలం చిత్రసీమపై విపరీతమైన ప్రభావం పడింది. ఇప్పుడు ఓటీటీల వల్ల కూడా అదే పరిస్థితి. సినిమా విడుదలైన మూడు వారాలకే బొమ్మ ఓటీటీల్లో పడిపోతోంది. పెరిగిన టికెట్ ఛార్జీల దృష్ట్యా సామాన్య మధ్యతరగతి ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. మూడు వారాలు ఆగితే.. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడొచ్చన్న నిజం గ్రహించాడు. అందుకే.. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల తాకిడి బాగా తగ్గింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులెవరూ ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. దాంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలన్నీ నష్టపోతున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ కళ్లు తెరిచింది. ఓటీటీలకు వీలైనంత దూరం పాటించాలన్న నిర్ణయం తీసుకొంది. మొన్నటి వరకూ సినిమా థియేటర్లో విడుదలైన రెండు నెలల వరకూ. ఓటీటీలో ప్రదర్శించకూడదన్న అగ్రిమెంట్ ఉండేది. కరోనా-లాక్ డౌన్ పరిస్థితుల వల్ల దాన్ని సడలించారు. ఓటీటీ భారీ రేట్లు ఆఫర్ చేస్తుందన్న ఉద్దేశ్యంతో మూడు వారాలకు సినిమా ప్రదర్శించడానికి ఒప్పుకొన్నారు. అయితే.. దాని వల్ల థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్న నిజం గ్రహించి… ఇప్పుడు మళ్లీ పాత నిబంధనల దుమ్ము దులుపుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. సినిమా ఏదైనా సరే, థియేటర్లో విడుదలైన రెండు నెలల తరవాతే ఓటీటీలో ప్రదర్శించాలన్నది ఇప్పటి కొత్త రూలు. ప్రతీ నిర్మాతా ఎగ్రిమెంట్ పై ఇలానే సంతకం చేయాలి. అందువల్ల ఓటీటీ నంచి వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుందేమో? కానీ… థియేటర్లు నిలబడతాయి.
ఓటీటీ సంస్థలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద పాయింట్. వాళ్లకు కంటెంట్ కావాలి. సొంతంగా సినిమాలు తీసుకొని, కంటెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోలేరు. వాళ్లంతా నిర్మాతలపై, చిత్రసీమపై ఆధారపడాల్సిందే. కాబట్టి మరో మార్గం లేదు. కేవలం ఓటీటీల కోసమే తీసే సినిమాలుంటాయి. వాటి వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే… ఓటీటీ రేట్లతో కాస్త గట్టెక్కుదాం అనుకొన్న నిర్మాతలకే ఇబ్బంది. ఓటీటీ నుంచి ఇంత వస్తుందని ఫిక్సయిపోయి.. అందుకోసం సినిమాలు తీసిన వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడాల్సివస్తుంది. ఓటీటీలు కూడా.. కొత్త వ్యూహాలు అనుసరించడం ఖాయం. `సినిమా విడుదలైన తరవాత.. బాగుంటే కొంటాం, లేదంటే లేదు..` అని ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అలాగైతే కంటెంట్ ఉన్న సినిమాలకే సొమ్ములొస్తాయి.