చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పలుమార్లు అనుచరులతో సమావేశం నిర్వహించి.. వైసీపీలోకి వెళ్తున్నట్లు వారికి చెప్పారు. అయితే.. చంద్రబాబు ఆయనను పిలిచి పలుమార్లు మాట్లాడారు. పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు… ఆయన మెత్తబడినట్లు కనిపించినా.. మళ్లీ.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖలో.. పార్టీ, ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు కారణం చెప్పుకొచ్చారు. అయితే.. ఈ ప్రమేయం.. తన ఒక్క నియోజకవర్గంలోనే కాదన్నట్లుగా.. ఇతర నియోజకవర్గాల గురించి కూడా ప్రస్తావించారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమంచి తదనంతర రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన ప్రత్యర్దిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో పాటు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి కూడా కట్టబెట్టడం ఆమంచికి ఇబ్బందికరంగా మారింది.
ఆమంచి పార్టీకి రాజీనామా చేయడం ఖాయమని తెలిసిన వెంటనే… సీనియర్ నేత కరణం బలరాంను… చీరాల పంపించారు.. టీడీపీ అధినేత. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పోతుల సునీతతో.. కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమంచి అనుచరులు తప్ప.. టీడీపీ నుంచి ఎవరూ.. వైసీపీలోకి వెళ్లకుండా.. టీడీపీ నేతలు.. ఇప్పటికే.. జాగ్రత్తలు తీసుకున్నారు.