ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం బెటరని నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను కలిశారు. చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగసభ పెట్టి బలప్రదర్శన చేసి పార్టీలో చేరనున్నారు.
నిజానికి చీరాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే.. ఆమంచి కృష్ణమోహనే. ఆయన తర్వాత ఇండిపెండెంట్ గా నవతరం అనే పార్టీ పేరుతో పోటీ చేస్తే.. క్యాడర్ అంతా ఆయన వెంట వచ్చింది. విజయం సాధించారు. తర్వాత టీడీపీ మీదుగా వైసీపీలో చేరారు. వైసీపీ బలానికి తన క్యాడర్ తోడయితే గెలవాల్సింది ఓడిపోయారు. వైసీపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు.. ఆయనతో పాటు క్యాడర్ కూడా వస్తుందా లేదా అన్నది ఆయనకే తెలియాలి.
ప్రధాన పార్టీల్లో టిక్కెట్ దొరికే అవకాశం లేకపోవడంతో ఆమంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఆయనే సృష్టించుకున్నారు. రాజకీయాల్లో అవకాశాలను బట్టి పార్టీలు మారిపోవడం కామనే కానీ.. కాస్తంత రాజకీయ వ్యూహంతో అడుగులు వేయాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. చీరాల లాంటి సీటు నుంచి తప్పించి పర్చూరు ఇంచార్జ్ గా వేసినప్పుడే .. ఆమంచికి సీన్ అర్థమై ఉండాలి. కానీ చివరి వరకూ ఆలస్యం చేసి.. ఇప్పుడు మళ్లీ సొంత బలంతో సత్తా చూపాల్సిన సమయం వస్తోంది. ఇక్కడ తేడా కొడితే ఆయన రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడుతుంది.