ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులతో తమ సంస్థను విస్తరించాలనుకున్న అమరరాజా మనసు మార్చుకుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొంటున్న ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం చేసుకోబోతోంది. పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు ఇచ్చి అమరరాజా పెట్టుబడులను తెలంగాణ స్వాగతిస్తోంది.
అమరరాజా కంపెనీని గల్లా కుటుంబం ప్రారంభించడానికి కారణం వెనుకబడిన చిత్తూరు జిల్లా యువత, మహిళలకు ఉపాధి కల్పించడం. అమెరికా నుంచి తిరికి వచ్చి గల్లా జయదేవ్ తండ్రి బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా అమరాన్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. చిత్తూరు జిల్లాల వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పరిశ్రమపై రాజకీయ కోణంలో కక్ష సాధింపులన్న ఆలోచనలు చేయలేదు. కానీ .. జగన్ సర్కార్ మాత్రం .. గల్లా జయదేవ్ టార్గెట్‌గా ఆయన కంపెనీని మూసేయాలని ప్రయత్నించింది.
అధికారుల తప్పుడు నివేదికలతో రెండు సార్లు కరెంట్ నిలిపివేసి ఉత్పత్తికి ఆటంకం కలిగించారు. క్లోజర్ నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఇక రాజకీయ కక్ష సాధింపులకు నిలయమైన ఏపీలో ఇక పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం శ్రేయం కాదని నిర్ణయించుకున్నారు. బ్యాటరీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో .. కొన్ని వేల కోట్ల పెట్టుబడులను అమరరాజా పెడుతోంది. ఇవన్నీ తెలంగాణకు తరలి పోతున్నాయి.
ఏపీ సర్కార్ బయట వ్యక్తుల నుంచి పెట్టుబడులు తెప్పించలేకపోతోంది. కనీసం ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఓ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసే ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ ఉండదు.. ఇక ముందురాదని ఎవరైనా అనుకుంటే.. దానికి ఈ ప్రభుత్వ పెద్దలే కారణం అవుతారు.