ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల విచారణను ఫిబ్రవరి 23న చేపడతామని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డికి తెలిపింది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.
అంతకు ముందు సోమవారం ఉదయమే అమరావతి కేసును సుప్రీంకోర్టు బెంచ్ ముందు మెన్షన్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మామూలుగా అయితే జనవరి 31వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. తర్వాత ఏడో తేదీన విచారణకు లిస్ట్ అయినట్లుగా కంప్యూటర్ జనరేటెడ్ లిస్టింగ్ కనిపించింది. అయితే ఏడో తేదీన కూడా బెంచ్ మీదకు వస్తుదో లేదో చెప్పడం కష్టమని సుప్రీంకోర్టు వర్గాలు తేల్చడంతో ప్రభుత్వం హడావుడిగా మెన్షన్ చేయాలని…సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. అదీ సాధ్యం కాకపోవడంతో.. ప్రభుత్వ న్యాయవాది నేరుగా ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
మాములుగా కంప్యూటర్ లో జనరేట్ అయిన దాని ప్రకారం చూస్తే.. మంగళవారం విచారణ జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు బెంచ్ ఎదుట ప్రభుత్వ న్యాయవాది ప్రత్యేకంగా అడగడంతో.. 23వ తేదీన విచారణకు తీసుకుంటామని చెప్పారు. నిజానికి అమరావతిపై హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసి ఉంటే.. అంతే ప్రయారిటీగా విచారణ జరిపి ఉండేవారు. కానీ ప్రభుత్వం ఆరు నెలల తర్వాత రావడంతో ప్రాధాన్యత కోల్పోయినట్లయింది.