బిడ్డ డ్రైనేజీ పనుల్లో చనిపోతే… వచ్చిన ఐదు లక్షల్లో రూ. రెండున్నర లక్షలు వాటా అడిగిన అంబటి రాంబాబు వ్యవహారం గత నెలలో సంచలనం అయింది. తనకు ఇమ్మన్న రెండున్నర లక్షలు ఇవ్వకుండా మీడియాకు ఎక్కి రచ్చ చేస్తారా అని పగబట్టిన అంబటి రాబాబు… వారికి మంజూరైన చెక్కును వెనక్కి పంపేశారు. ఇప్పుడు ఆ బాధితులకు చెక్కు అందలేదు. పరిహారం వెనక్కి పోయిందని చెబుతున్నారు. మంజూరైన చెక్కును ఇవ్వకుండా…. వెనక్కి పంపిన అంబటి వ్యవహారశైలి ఇప్పుడు సత్తెనపల్లిలో చర్చనీయాంశం అవుతోంది.
కన్నబిడ్డను కోల్పోయిన వాళ్లు .. వచ్చే పరిహారంతో అయినా ఎలాగోలా బతకాలనుకున్నారు. కానీ రాజకీయ రాబందులు వారిని బతకనివ్వడం లేదు. అంబటి రాంబాబు రెండున్నర లక్షలు అడిగారని జనసేన నాయకుల సాయంతో వారు మీడియా ను ఆశ్రయించారు. దీంతో అయినా ఉలిక్కి పడి.. ఆ బాధితులకు న్యాయం చేశామని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం వారికి చెక్కులు ఇవ్వలేదు. నిజానికి ఆ చెక్కు మంజూరు అయింది. ఆర్డీవో దగ్గరకు వచ్చింది. ఇక పంపిణీ చేయడమే మిగిలింది. కానీ వాటా ఇవ్వకపోవడం వల్ల రాజకీయ ఆదేశాలతో ఆగిపోయింది.
ఆ బాధితులు మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. తమ సొమ్మేదో ఇస్తున్నట్లుగా వారు వెంటనే.. కుట్రలు ప్రారంభించారు. ఆ చెక్కు కనిపించడం లేదని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వెనక్కి పంపేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. అసలు పాలనలో సైకోయిజం అంటే ఇదేనని మండి పడుతున్నారు. తమ బిడ్డ ఉసురు పోసుకుంటారని శాపనార్ధాలు పెడుతున్నారు. కానీ పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే పాలన అన్నట్లుగా ఉన్న ఈ రాజకీయ నాయకులకు అవేమీ కనిపించడం లేదు… వినిపించడం లేదు