ఎన్నికల్లో ఎ పార్టీ అయినా మరో పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తుంది. అదే రాజకీయం. అదే ప్రజాస్వామ్యం. కానీ వైసీపీ నేతలకు మాత్రం తమపై ప్రత్యర్థులు ఎవరినైనా నిలబెడితే.. తనను ఓడించడానికి కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. వారి మాటలు విని అందరూ విస్తుపోవాల్సి వస్తోంది. ఈ విషయంలో అంబటి రాంబాబు మరింత దూకుడుగా ఉన్నారు. కన్నా లక్ష్మినారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో తనను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారంటూ రోజూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు.
కన్నాను అభ్యర్థిగా పెట్టడం కుట్ర ఎలా అవుతుంది రాంబాబు అంటే.. మాత్రం తనదైన శైలిలో సంబంధం లేని అంశాలను మాట్లాడి.. చంద్రబాబు వచ్చినా సరే అంటూ ఊగిపోతున్నారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతలు కూడా పాపం రాంబాబు అనుకోకుండా ఉండటం లేదు. ఇటీవల సత్తెనపల్లిలో మారుతున్న పరిణామాలు అంబటి రాంబాబుకు ఇబ్బందికరంగా మారాయి. పార్టీలోని సగం మంది క్యాడర్ ఆయనకు దూరమయ్యారు. మిగతా సగం చేస్తున్న దందాలతో ప్రజలకు దూరమయ్యారు. గ్రామాల్లో ఉండే వర్గ పోరాటాలతో నెట్టుకు రావాలని అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారు.
కానీ కన్నా లక్ష్మినారాయణ అభ్యర్థి గా మారడంతో.. ఆయన పప్పులేమీ ఉడికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే తాను ఓడిపోయానని గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తే.. వచ్చే ఎన్నికలలో అంబటికి టిక్కెట్ ఇవ్వకపోవచ్చునని.. సత్తెనపల్లిలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.