ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ఇరాన్ తో ఇండియా వ్యాపార లావాదేవీలకు ఒప్పందం కుదుర్చుకోవడంతో హెచ్చరికలు జారీ చేసింది.
చాబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్- ఇండియా ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. భారత్ విదేశాంగ విధానాలు, లక్ష్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది.తాము అంక్షలు విధించిన దేశంతో ఏ దేశమైన వ్యాపార లావాదేవీలు జరిపితే వారిపై కూడా ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తాము చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తేల్చి చెప్పారు.
చాబహార్ ఒప్పందం : మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు కొనసాగించేందుకు చాబహార్ పోర్టు మార్గంగా ఉంది. ఈ దారి గుండా కజకిస్థాన్, తుర్కెమెనిస్థాన్,తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్‌తో 10 ఏళ్ల పాటు భారత్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా భారత్ ను హెచ్చరించింది.
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా చేసిన హెచ్చరికలపై ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి.