అద్దాల మేడల్లో ఉన్న అమెరికా భయపడుతోంది. ఎలాంటి ఫలితాలొచ్చినా హుందాగా స్వీకరించే నేతలు అమెరికాలోనూ కనుమరుగయ్యారు కాబట్టి అక్కడి ప్రజలు కూడా.. విధ్వంస భయాలను చవి చూస్తున్నారు. తాను ఓడిపోతే.. చూస్తూ ఊరుకోనని హెచ్చరిస్తున్న ట్రంప్ కారణంగా.. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలొచ్చినా అల్లర్లు జరుగుతాయన్న భయం.. అమెరికాలోని ప్రధాన పట్టణాల్లో కనిపిస్తోంది. న్యూయార్క్ సహా.. ప్రధాన నగరాల్లో ఉన్న అద్దాల మేడలన్నింటికీ.. చెక్కలను రక్షణగా పెట్టుకుంటున్నారు.
దీంతో ప్లైవుడ్ చెక్కలకు ఎక్కడా లేని గిరాకీ వచ్చింది. ట్రంప్ ఎన్నికల వ్యూహం కాస్త విద్వేషం రెచ్చగొట్టేలా ఉంటుంది. ఈ కారణంగా ఆయన గెలిచినా.. ఓడినా అభిమానులు రచ్చ చేస్తారన్న భయం మాత్రం అమెరికాలో కనిపిస్తోంది అన్ని ప్రధాన నగరాల్లో ఓటింగ్ ప్రారంభమయ్యే సమయానికి అద్దాలు ఉన్న పెద్ద పెద్ద భవనాలకు చెక్కలు కొట్టుకోవడం పూర్తయింది. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేవి. కానీ ఇటీవలి కాలంలో తీరు మారిపోయింది.
పైగా.. నల్లజాతి ఉద్యమాలు రావడం.. అల్లర్లు జరగడం కామన్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి రాజకీయాలు కూడా ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటి వరకూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోలింగ్ ముదు హింస.. పోలింగ్ అనంతర హింస ఉండేది.. ఇప్పుడది అమెరికాకూ పాకిందని… తాజా భయం నిరూపిస్తోంది.