గుజరాత్లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న హోంమంత్రిగా పని చేసిన అమిత్ షా .. ఇప్పుడు కేంద్రంలో… మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు.. అదే హోంశాఖను…చేపట్టబోతున్నారు. అమిత్ షా దశ తిరిగింది. అంచెలంచెలుగా బీజేపీలో ఎదుగుతూ ఇప్పుడు పార్టీలోనే నెంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. పార్టీని ఇప్పటి వరకు కనుసైగలతో నడిపిన అమిత్ షా.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్ గా మారబోతున్నారు.
అమిత్ షా అలా.. అలా ఎదిగిపోయారు…!
ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ నిర్మాతల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీని వయసు కారణాలపై పోటీ నుంచి తప్పించినపుడు ఆయన సొంత నియోజకవర్గం గాంధీనగర్ నుంచి ఎవరు పోటీచేస్తారని మీడియాలో ఊహాగానాలు సాగాయి. ఒకప్పుడు అద్వానీకి పోల్ మేనేజర్‌గా పనిచేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగుతారని ఎవరూ ఊహించలేదు. కారణం.. షా అప్పటికే రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధినేతగా కీలక బాధ్యతల్లో ఉన్నవారు. కానీ, ఆయనను ప్రత్యక్ష పోటీకి దింపినపుడే మోదీ తదుపరి కేబినెట్లో బెర్తు ఖాయమని తేలిపోయింది. ఊహించినట్లే షా 5,57,014 ఓట్ల భారీ మెజారిటీ కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించారు. అమిత్ షా మోదీకి అత్యంత ఆంతరంగికుడు. ఏ విషయమైనా వారిద్దరూ చర్చించుకొన్నాకే బయటపెడతారు.
అద్వానీ కోసం ప్రచారం చేసి.. అద్వానీ సీట్లో గెలిచి..!
మొదటిసారి షా మోదీని 1982లో కలిశారు. షా 1991 ఎన్నికల్లో అద్వానీకి ప్రచార నిర్వహణాధికారిగా పనిచేశారు.1990లో మోదీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1997లో షా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మరో మూడు సార్లు గెలిచారు. 2001లో మోదీని ముఖ్యమంత్రి చేశాక షా దశ తిరిగిపోయింది. మోదీ మంత్రివర్గంలో హోంశాఖతో పాటు 12శాఖలు నిర్వహించారు. మోదీ ప్రధాని అయ్యాక అమిత్ షా కేంద్ర రాజకీయాల్లో కీలకమయ్యారు. తొలిసారి కేబినెట్లో చేరకుండా- బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఒకటొకటిగా అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించి దేశం మొత్తాన్ని కాషాయమయం చేయడంలో విశేష కృషి చేశారు. ఇపుడు ఆయన మోదీ కేబినెట్లో చేరారు. పార్టీ సారథ్యం నుంచి పాలన వ్యవహారాల్లోకి అడుగుపెట్టారు. కేబినెట్లో నెంబర్ టూ అయ్యారు.
మోడీకి ఆల్ ఇన్ వన్ షానే..!
మోదీతో అమిత్ షా బంధం ఈనాటిది కాదు.. ఇంకా చెప్పాలంటే గుజరాత్ నుంచి పెనవేసుకుపోయిన ఫెవికాల్ బంధం.. అందుకే అమిత్ షాపై మోదీకి గురి ఎక్కువ.. 2014లో గెలవగానే.. అమిత్ షాకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి బీజేపీ స్వరూపమే మారిపోయింది. దేశం నలుమూలలా కాషాయన్ని విస్తరింపజేయడంలో అమిత్ షా సూపర్ సక్సెస్ అయ్యారు. చివరికి బీజేపీ కాలు పెట్టలేదు అనే చోట కూడా కమలాన్ని కింగ్ మేకర్‌గా నిలిపారు. రెండు సీట్లకే పరిమితమైన రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి తెచ్చారు. అమిత్ షా వ్యూహాలు, దూకుడు,మోదీతో సాన్నిహిత్యం.. పార్టీకి-ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అమిత్ షా ముందుకు వెళ్ళారు.