వైసీపీ ఆజ్ఞాత మిత్రపక్షంగా ఉండగా ఏపీలో పెద్దగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ పెద్దలు హఠాత్తుగా తమ మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నామొన్నటిదాకా తెలంగాణకు వెల్లువలా వస్తున్న కేంద్ర మంత్రులు ఏపీకి మాత్రం రావడం లేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. నేరుగా అమిత్ షానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పర్యటన చేయాలనుకుంటున్నారు. ఆ మేరకు తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. జనవరి ఎనిమిదో తేదీన అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో అమిత్ షా తొలి సారి రాజకీయ పర్యటన నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. కేంద్రం మంత్రులు “పార్లమెంట్ ప్రవాస్ యోజన” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటించి.. చేసి మంచి పనుల్ని అందరికీ చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఏపీకి పెద్దగా ఎవరికీ తెలియని కేంద్రమంత్రులు వచ్చారు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నేరుగా అమిత్ షా వస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అమిత్ షా పర్యటన – కర్నూలు, హిందూపురం లోక్సభ నియోజకవర్గాల్లో జరగనున్నట్లుగా తెలుస్తోంద.ి
పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రధానంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలపై విరుచుకుపడుతూంటారు. తెలంగాణలో అదే జరుగుతోంది. ఏపీలో మాత్రం ఇంకా ఆ స్థాయి దాడి జరగడం లేదు. ఇప్పుడు అమిత్ షా ఏపీ పర్యటనలో జగన్ ప్రభుత్వంపై ఎలా స్పందిస్తారన్నదాన్ని బట్టి.. వైసీపీతో బీజేపీ సంబంధాలు ఉంచుకోవాలనుకుందా.. తెంచుకోవాలనుకుంటోందా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమిత్ షా పర్యటన కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే .. ఈ ఏర్పాట్లను హైజాక్ చేసేందుకు వైసీపీ నేతలు కూడా ప్రయత్నించే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది.