ఉత్తరాంధ్రలోని ప్రముఖ రాజకీయ నేతలుగా.. చెలామణి అయిన దాడి వీరభద్రరరావు, కొణతాల రామకృష్ణ ఇద్దరికీ … ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పాత్ర లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇద్దరూ పోటీ చేయలేదు కానీ… తమ కుటుంబీకులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వైసీపీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇద్దరూ ప్రయత్నించారు కానీ… సమీకరణాలు కుదరలేదు. దాంతో ఇద్దరూ టీడీపీలో చేరలేకపోయారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించినా.. ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించకపోవడంతో.. ఆయన కూడా వైసీవైపు మొగ్గాలు. వారం క్రితం దాడి వీరభద్రరావు పార్టీలో చేరగా.. శనివారం.. పార్టీలో చేరుదామని.. కొణతాల రామకృష్ణ హైదరాబాద్ వెళ్లారు.
కానీ .. కండువా కప్పి… టిక్కెట్ ఇవ్వరని తెలిసిపోయిందేమో కానీ… పార్టీలో చేరబోనని చెప్పి వచ్చేశారు. ఇప్పుడు దాడి వీరభద్రరావుకు కానీ.. ఆయన కుటుంబీకులకు కానీ.. టిక్కెట్లు కేటాయించలేదు. అలాగే కొణతాల రామకృష్ణ కూడా అటు టీడీపీకి.. ఇటు వైసీపీకి కాకుండా పోయారు. ఇద్దరూ అనకాపల్లి రాజకీయాల్లో ఉద్దండులుగానే తలపడ్డారు. ఇద్దరికీ ఒకే సారి.. రాజకీయ దుర్భర స్థితిలోకి వచ్చారు. తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఎన్నికల్లో ఏదో ఓ పార్టీకి పని చేయడానికి వారు సిద్ధపడకపోవచ్చు. అయితే.. సైలెంట్‌గా ఉంటారా.. .లేక.. ప్రత్యామ్నాయ రాజకీయం ఏదైనా చేసూకుంటారా.. అన్నదానిపై మాత్రం.. ఆసక్తి ఏర్పడుతోంది.
దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణలతో గతంలో.. పవన్ కల్యాణ్ మంతనాలు జరిపారు. ఇప్పుడు వారిద్దరికి ఉన్న ఒకే ఆప్షన్ జనసేన అని.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి వారేమి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రారంభమయింది. జనసేనలో అయినా ఇద్దరూ చేరే అవకాశం ఉండదని.. ఎవరో ఒకరు మాత్రం.. అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చంటున్నారు. ఇంటికెళ్లి పిలిచినా దాడి వీరభద్రరావు రాకపోవడం… ఇతర పార్టీల్లో చాన్స్ లేదనుకున్న తర్వాత తన దగ్గరకు వస్తున్నారని పవన్ భావిస్తే.. ఆయనను కూడా ఆహ్వానించకపోవచ్చంటున్నారు.