ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం చూసిన వారంతా ముక్త కంఠం తో చెప్పిన విషయం ఒక్కటే, కథ, స్క్రీన్ ప్లే వంటి వాటి కంటే ముఖ్యం గా, అర్జున్ రెడ్డి పాత్రని తీర్చిదిద్దిన విధానమే ప్రేక్షకులని ఎక్కువగా ఆకట్టుకుంది. చాలా మంది తెలుగులో వచ్చిన అతి కొద్ది “క్యారక్టర్ డ్రివెన్ మూవీస్” లో ఇది ఒకటి అని ప్రశంసించారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గతం లోనూ తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి – “క్యారక్టర్ డ్రివెన్ ” అని చెప్పుకోదగ్గవి. అయితే వాటిలో మిగతా కమర్షియల్ అంశాలు కూడా సరిగ్గా కుదరటం తో ప్రేక్షకులని ముఖ్యంగా ఆకట్టుకున్న పాయింట్ ఏది (క్యారక్టరా, లేక కథా లేక స్క్రీన్ ప్లే యా) అనే విషయం లో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. అందువల్ల character driven screen play అనే ట్యాగ్ రాలేదు ఆ సినిమాలకి. ఐతే చాలా మంది దర్శకులకి ఇది అనుభవపూర్వకమే – తాము ఒక పాత్రని విపరీతంగా ప్రేమించి, ఆ పాత్రని వేర్వేరు conflicting సన్నివేశాల్లో పడేసి, అప్పుడా పాత్ర ఎలా రియాక్ట్ అవుతుందనే విషయం మీద పలు సీన్లు వ్రాసుకోవడం అనే ప్రక్రియ చాల మంది దర్శక రచయితలకి అనుభవమే. అయితే ఇలా ఒకే పాత్రని విపరీతంగా ప్రేమించిన దర్శకులందరికీ ఒక ప్రాబ్లెముంది. అదేంటో చూద్దాం.
ఉదాహరణకి పూరీ జగన్నాధ్ ని తీసుకుందాం. ఆయన్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ఇడియట్ (కన్నడలో అప్పు అని కూడా తీసాడు ఆయనే). ఇందులో కథ, స్క్రీన్ ప్లే కంటే కూడా జనాలని ఆకట్టుకున్నది ఆ reckless క్యారక్టరే. “ఏం కమీషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా” అని ప్రశ్నించే ఆ పాత్ర లోని కొత్తదనమే జనాలకి నచ్చింది. ఐతే పూరీ ఆ పాత్ర హేంగోవర్ లోనుంచి ఇప్పటికీ బయటికి రాలేదనిపిస్తోంది. పోకిరి, దేశముదురు లాంటి స్టార్ సినిమాల్లోనే కాక, బంపర్ ఆఫర్ లాంటి సినిమాల్లో కూడా అదే reckless పాత్ర ని హీరో ని చేసాడు పూరీ. కానీ ఈ పాత్ర జనానికి మొహం మొత్తి పూరీ సినిమా అంటేనే ప్రేక్షకులు ఆమడ దూరం వేళ్ళేలా చేస్తోంది.
అలాగే సుకుమార్ ఆర్య పాత్ర. ఆ పాత్ర లాంటి “నస పెట్టే ప్రేమికుడి” పాత్ర అప్పటి తెలుగు ప్రేక్షకులకి కొత్తే. సుకుమార్ రెండవ సినిమా జగడం వేరే ఛాయలతో తీసి ఫ్లాపయ్యే సరికి మళ్ళీ ఆర్య-2 అంటూ అదే పాత్రని రిపీట్ చేసి హిట్ కొట్టాడు సుకుమార్. కొన్నేళ్ళ తర్వాత ఎప్పుడైనా సుకుమార్ కి వరస ఫ్లాపులు తగిలితే ఆర్య-3 అంటూ ఆ పాత్ర ని మళ్ళీ తెర మీదకి తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు సందీప్ వంగ కూడా దాదాపు పది గంటల నిడివి గల సినిమా కి అయ్యేంత మెటీరియల్ అర్జున్ రెడ్డి పాత్ర మీద ఉంది అని చెబుతున్నాడు. అంటే ఆ పాత్రని సందీప్ ఎంత ప్రేమించాడో, ఆ పాత్ర మీద ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడే మెలిక ఉంది. ఇలా ఒక పాత్రని విపరీతంగా ప్రేమించిన దర్శకులు వేరే రకమైన పాత్రతో సినిమా తీసినపుడు అది ఫ్లాపవగానే తమకి తెలిసిన ఆ మొదటి పాత్ర దగ్గరికి వచ్చారు. సుకుమార్ జగడం ఫ్లాప్ కాగానే ఆర్య పాత్ర దగ్గరికి వచ్చినట్టు అన్నమాట. రెండు అంశాలున్నాయి ఇక్కడ. ఒకటి, ఫ్లాపైన ప్రతీసారీ తెలిసిన పాత్ర దగ్గరికి రావడం సుకుమార్ లాగా. రెండు, హిట్టు ఫ్లాపూ సంబంధం లేకుండా ప్రతీసారి అదే క్యారక్టర్ ని తిప్పి తిప్పి తీసి జరిగినన్ని నాళ్ళూ నడిపించడం పూరీ లాగా.
మరి సందీప్ రెండవ సినిమా ఏ పాత్ర తో తీస్తాడో, రెండింటిలో ఏ కోవకి చెందుతాడో వేచి చూడాలి. కానీ, ఈ రెండూ కాకుండా, వేర్వేరు పాత్రలతోనూ హిట్టు కొట్టాలంటే అది కేవలం కొంతమంది లెజెండ్ డైరెక్టర్లకే సాధ్యమైంది. సందీప్ గమనం ఎలా ఉంటుందో వేచి చూడాలి.