ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు మాట తరచూ వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే ఎన్నికలు ముందే వస్తాయంటూ కేడర్‌ను సంసిద్ధం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను అధికార పార్టీ కొట్టివేస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తోంది.
కానీ వైఎస్ఆర్సీపీ ముందస్తుకు తమ పార్టీ శ్రేణులను చాలా రోజులుగా సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం బాట పట్టింది. మార్చిలో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. అప్పుడే టిక్కెట్లు ప్రకటిస్తానని జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనించిన విపక్షాలు ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది.
ముందస్తుకు వెళ్లాలంటే.. జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే సరిపోదు. ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాలి. కేంద్రం అనుమతి లేకుండా రద్దు చేస్తే.. రాష్ట్రపతిపాలన విధించినా విధించవచ్చు. అందుకే జగన్ మోదీ, అమిత్ షాల పర్మిషన్ తీసుకున్నరన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఏ కారణంతో జగన్ ముందస్తుకు వెళ్లినా ప్రజలకు మాత్రం ఒకటే అర్థ్మవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం లేక… అప్పు పుట్టక ముందస్తుకు వెళ్తున్నారని..ఆయన గెలిస్తే పథకాలు కూడా ఇవ్వలేరని.. ప్రశ్నిస్తే పోలీసులతో కట్టడి చేస్తారని ఎక్కువ మంది నమ్ముతారు.
జగన్ ముందస్తుకు వెళ్లదల్చుకుంటే..ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది. ఆ కారణం ప్రజల్ని కన్విన్స్ చేయకపోతే.. వారి ఆగ్రహం ఓటమి రూపంలో జగన్ ను వెంటాడుతుంది. అందుకే జగన్ ముందస్తు ఆలోచనలు అంటే చేస్తే అది ఘోర తప్పిదమేనన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.