మూడు రాజధానుల కోసం అంటూ వైసీపీ నేతలు విశాఖలో గర్జించారు. ఆ గర్జన ఎవరికైనా వినిపించిందా లేకపోతే… ఫేక్ ఫోటోలు.. మార్ఫింగ్లతో చేసుకున్నారా అన్నది పక్కన పెడితే.. అసలు మూడు రాజధానులు ఎవరు ఏర్పాటు చేయాలి? ఈ గర్జనలు నిర్వహించిన వాళ్లే ఏర్పాటు చేయాలి. అంతా వాళ్ల చేతుల్లోనే ఉంది. మరి ఏర్పాటు చేయకుండా ఎందుకు ఈ గర్జనలు నిర్వహిస్తున్నారు ? ఎందుకంటే ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేయడానికి. ప్రజలంతా వెర్రి గొర్రెలు అని తాము నమ్మే సిద్ధాంతాన్ని నిజం చేయడానికి. ప్రజలను ఓ మాదిరిగా కూడా చూడటం లేదని గుర్తు చేయడానికి.
మింగలేక మంగళవారం గర్జనలు !
రాజధాని రాష్ట్రం ఇష్టం అని కేంద్రం చెబుతోంది. మంత్రులూ చెబుతున్నారు. మరి ఎందుకు ఏర్పాటు చేయడం లేదు..? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి ..151 మందిసొంత ఎమ్మెల్యేలు.. మరో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తిరుగులేని స్థానంలో ఉండి ఎందుకు గర్జనలు నిర్వహిస్తోంది. చేయాలనుకుంటే మూడు రాజధానుల్ని తక్షణం చేయవచ్చు కదా? చేయడం సాధ్యం కాకపోతే.. మూడు రాజధానుల గర్జనల పేరుతో ప్రజల్ని మోసం చేసినట్లు కాదా? మూడు రాజధానులు చేయకుండా గర్జనలు నిర్వహిస్తే రాజధాని ఏర్పడుతుందా ? రాష్ట్రం చేతుల్లో ఉన్న రాజధాని ఏర్పాటు ఎందుకు సాధ్యం కావడం లేదు ? . ఎందుకంటే మూడు రాజధానులు సాధ్యం కావు.
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుని ఇప్పుడు ఈ గర్జనలేంటి?
మూడు రాజధానులు.. రాజకీయ పరంగానేకాదు.. సాంకేతికపరంగా కూడా సాధ్యం కావని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా రిట్ ఆప్ మాండమస్ ప్రకటించింది. సుప్రీంకోర్టుకువెళ్లి స్టే తెచ్చుకుంటే తప్ప మూడు రాజధానులు సాధ్యం కాదు. కానీ తీర్పు వచ్చిన ఆరు నెలల వరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. ఆరు నెలల తర్వాత సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే తమ వాదనలు వినాలని రైతులు కూడా పిటిషన్ వేశారు. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయడానికి ఏ మాత్రం సిగ్గు లేకుండా రంగంలోకి దిగారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల్ని మోసం చేసి ఏం సాధిస్తారు ?
మూడు రాజధానులు సాధ్యం కావని తెలిసిన తర్వాత కూడా.. ఏర్పాటు చేయలేమని తెలిసిన తర్వాత కూడా .. అవి చేస్తామని .. విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా లాభం కలగవచ్చు కానీ.. రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితుల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయి. ప్రజల్లో విద్వేషాలు పెరుగుతాయి. దీని కోసమే అధికార పార్టీ పని చేస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. ఆయనకు రాజకీయం..తన పదవి తప్ప..రాష్ట్ర ప్రజల బాధ్యత.. రాష్ట్ర సంపదపై ఇసుమంతైనా చింత లేదు. ఆ విషయంలో ఆయన మొదటి సమావేశం పెట్టిన ప్రజా వేదికను కూల్చినప్పుడే తెలిపోయిది. ఇప్పుడు ఆయన తన ఆలోచనలో రాష్ట్రాన్ని కూల్చేస్తున్నారు. మేలుకోవాల్సింది ప్రజలే.