ఏ బంధమూ ఏ సంబంధమూ లేని స్త్రీ, పురుషుల సాన్నిహిత్యానికి సమాజ పరమైన ఆమోదం లేని కాలంలో – సినిమా సెలబ్రిటీ, రికార్డులు సృష్టించిన రాజకీయ వేత్త ఎన్ టి ఆర్, రచయిత్రి(?) లక్ష్మీపార్వతి ల పరిచయం గాఢమైన స్నేహంగా మారింది. ఈ పార్ట్ లో లక్ష్మీపార్వతిలో స్త్రీ స్వాభావికమైన లాలిత్యాన్ని, మార్దవాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఓటమిలో నిరుత్సాహంతో, శారీర సహాయనిరాకరణతో, కుటుంబీకుల అనాదరణతో ఒంటరితనంతో మిగిలిపోయిన ఎమోషనల్ కళాకారుడు అయిన ఎన్ టిఆర్ ఆమె పట్ల అంత గాఢంగా ఎంత ఆకర్షితుడు అయిన తీరు, అందులో జస్టిఫికేషన్ సినిమాలో చక్కగా వుంది.
ఎన్ టిఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబుల చుట్టూ తిరిగిన కథ “లక్ష్మీస్ ఎన్ టి ఆర్”.
ఎన్ టి ఆర్- లక్ష్మీ పార్వతి ల సాన్నిహిత్యం ఆయన కొడుకులకు కూతుళ్ళకు నచ్చలేదు. పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు. నచ్చని వేల వేల మందిలో చంద్రబాబు నాయుడు ఒకరు. ఈమధ్యే కాస్త గట్టిగా నవ్వుతున్నారు తప్ప ఆయన మాటల్లో కాని చూపుల్లో కాని, మొహంలో కాని ఏ భావాలూ కనబడవు. అప్పట్లో యువ జర్నలిస్టులమైన మేము చంద్రబాబుది చెక్కమొహం అనుకునే వాళ్ళం. సినిమాలో ఆయన్ని విలన్ గా చూపించడానికి ఆయనలో అనేక ఎక్స్ ప్రెషన్లు పెట్టించారు.
ఎన్ టి ఆర్ ఆరాధకురాలిగా లక్ష్మీపార్వతి చక్కగా సరిపోయారు. అయితే రాజకీయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలలో ఆమె ప్రత్యక్ష జోక్యానికి, పార్టీ వారినుంచి, బయటవారి నుంచి లంచాలను ఆమె అత్యంత ఖరీదైన కానుకలుగా అందుకున్నారనడానికి ఎన్నో దాఖలాలు వున్నాయి. సినిమాలో ఈ ప్రస్తావనే లేదు.
లక్ష్మీపార్వతి అధికార కేంద్రం కావడంతో ఆమె చుట్టూ చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూండటం – ఆమెను ఆమోదించలేనివారు ఒకటయ్యారు. వారికి చంద్రబాబు నాయకత్వం వహించారు. ఏ అవకాశాన్నైయినా తనకు అనుకూలంగా మార్చుకోగల సామర్ధ్యము, చతురత వున్న ఆర్గనైజర్ చంద్రబాబు నాయుడు. చక్రం తిప్పారు. ఎన్ టి ఆర్ ను దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగిన చరిత్ర.
సినిమాలో చంద్రబాబు తనపదవికోసం కుటుంబీకులను పార్టీని ఎగదోసినట్టు చూపించారు. ఎన్ టి ఆర్ అండతో అధికారులకు ఆదేశాలు ఇవ్వగలిగిన స్థాయికి పెరిగిన లక్ష్మీపార్వతి “రాజ్యాంగేతర శక్తి” ని చర్చించలేదు. చూపించలేదు. ప్రస్తావనే తీసుకురాలేదు.
నిజజీవితంలో పెయిన్ వున్న మహానటి సినిమా మొత్తం మాదిరిగా ఈ సినిమాలో ఎన్ టి ఆర్ పై చెప్పులు విసిరిన సంఘటన, మరణం, మరణించాక కుటుంబీకులు వచ్చాక లక్ష్మీపార్వతి భౌతిక కాయానికి క్రమంగా దూరమైపోవడం గుండెను పట్టుకుంటాయి.
ఏమైనా కధానాయకుడు, మహానాయకుడు లాగే లక్ష్మీస్ ఎన్ టి ఆర్ కూడా మరొక అసమగ్రమైన బయోపిక్. ప్రస్తుత వాతావరణంలో ఈ సినిమా డబ్బు చేసుకోడానికి పనికొస్తుందేమో కాని, ఓటర్ నిర్ణయాన్ని మార్చడానికైతే పనికి రాదు.