” ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా లేనంత గౌరవం ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చూస్తేనే భయమేస్తూ ఉంటుందని ” దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో కాలేజీ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. ఈ మాటలు ఆ విద్యార్థులకు ఎంత వరకూ అర్థమయ్యాయో కానీ.. ఇది మన దేశంలో వంద శాతం నిజం. అలా బడా దోపిడీగాళ్లు అంతా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇందులో సందహమే లేదు. రాజకీయ అవినీతి వల్లనే వేల కోట్లు సంపాదిస్తారు. ఇతర అవినీతి వల్ల అలా సంపాదించలేరు. మరి ఆ దొంగల్ని..క్రిమినల్ని రాజకీయాలు ఎందుకు భరిస్తున్నాయి…? చిన్న కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వరే.. మరి ఎందుకు ప్రభుత్వాలనే చేతుల్లో పెట్టేస్తున్నారు ? ప్రజల భవిష్యత్ ను ఎందుకు అప్పగిస్తున్నారు ? దీనికి పరిష్కారమేంటి ?
చదువుకున్న వాడు రాజకీయం చేస్తానంటే పప్పు అంటారు – అదే రౌడీకైతే సలాం కొడతారు !
ఓ చదువుకుకున్న వ్యక్తి నీటుగా షేవింగ్ చేసుకుని మనం బాగుపడాల్సింది ఇలా కాదు.. ఇలా చేద్దాం.. బాగుపడదాం అని చెబితే.. ఈడెవడు పెద్దపప్పులాగున్నాడు అని జనం ఎగతాళి చేస్తారు. అదే చదువు, సంధ్యా లేని ఓ రౌడీ వచ్చి నేను రాజకీయం చేస్తా.. అంటే.. ఆ క్రిమినల్ పక్కన ఓ వంద మంది చేరిపోయి భజన చేస్తారు. ఎలక్షన్లలో ఇటు చదువుకున్న వ్యక్తి.. అటు ఆ రౌడీ నిలబడితే ప్రజలు కూడా.. ఈ చదువుకున్న వ్యక్తిని ఆదరించరు. ఆ రౌడీనే ఆదరిస్తారు. ఓట్లేస్తారు. ఇక్కడ తప్పు ఎవరిది.. ఎవరు చేస్తున్నారు అన్న సంగతి పక్కన పెడితే.. అలాంటి క్రిమినల్స్ ను ముందుగా రాజకీయాల్లోకి రాకుండా చేయల్సిన బాధ్యత మాత్రం అందరి మీదా ఉంటుంది. ముఖ్యంగా దేశాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల మీద ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో బ్రిటిష్ వాళ్లు పెట్టిన కేసుల్ని గొప్పగా చెప్పుకునేవారు. స్వాతంత్ర్యం కోసం జైలుకెల్లామని చెప్పుకునేవారు. ప్రజలు కూడా దాన్ని అదనపు అర్హతగానే భావించేవారు. కానీ ఇప్పుడు… దొంగతనాలు, ఖూనీలు, స్కాంలు.. చేసి.. వేల కోట్లు పోగేసుకున్న వారికి తమ ఘనకార్యాలే అదనపు అర్హతలుగా మారాయి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో.. ఏ రాష్ట్రంలో అయినా… అరవై శాతం మందికిపైగా క్రిమినల్ కేసులు ఉంటాయి. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వారికి పాలనా పగ్గాలు.. వ్యవస్థలు చేతుల్లోకి వెళ్తే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉంటాయో కొన్నిరాష్ట్రాల్లో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అందుకే ఘోరమైన నేరాల్ని చేసిన వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని .. చాలా కాలంగా కొంత మంది న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత నాలుగైదేళ్లుగా విచారణ జరుపుతూనే ఉంది. ఈ పిటిషన్ తరహాలోనే రాజకీయ నేతలపైకేసులూ తేలడం లేదు. తాజాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని ఆదేశాలు.. సూచనలు దిగువకోర్టులకు ఇచ్చింది.
క్రిమినల్ నేతలపై కేసుల విచారణ ఆలస్యం అసలు సమస్య !
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు
►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి.
►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి
►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి
►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి.
గతంలో అమికస్ క్యూరీ కీలక సూచనలు – కానీ సుప్రీంకోర్టే పట్టించుకోలేదు !
మూడేళ్ల కిందట కూడా సుప్రీంకోర్టు క్రిమినల్ నేతలు వ్యవస్థల్ని మేనేజ్ చేసే స్థాయికి రావడాన్ని సీరియస్‌గా తీసుకుంది. గతంలో ఇలాంటి కేసులపై సలహాల కోసం అమికస్ క్యూరీని నియమించింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ.. సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న విజయ్ హన్సారియా ఒక నివేదికను అందజేశారు. అందులో ముఖ్యమంత్రులు మొదలు ఎంపీలు.. ఎమ్మెల్యేలు మొదలు కొని ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిపై నమోదైన క్రిమినల్ కేసులను ఐదేళ్లకు మించి పెండింగ్ లో ఉండటాన్ని ప్రస్తావిస్తూ అనేక సూచనలు చేశారు.
– సీఆర్ పీసీ సెక్షన్ 309 ప్రకారం రోజువారీగా ట్రయల్ నిర్వహించాలి. దీనికి సంబంధించిన పని విభజనను హైకోర్టు లేదా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీలు రెండు వారాల్లో పూర్తి చేయాలి. అసాధారణ.. అత్యవసర పరిస్థితుల్లో తప్పించి వాయిదాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే కారణాల్ని నమోదు చేయాలి.
– ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారిస్తున్న కోర్టులు ముందుగా వాటిపైనే విచారణను కొనసాగించాలి.
– వాయిదాలు పడకుండా ప్రాసిక్యూషన్.. డిఫెన్స్ న్యాయవాదులు సహకరించాలి.
– విచారణ కోసం సంబంధిత జిల్లా సెషన్స్ జడ్జితో సంప్రదించి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రత్యేక కోర్ుటలో కనీసం ఇద్దరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి.
– ఒకవేళ నిందితుడు ట్రయల్ జాప్యానికి కారణమైతే వారికి బెయిల్ రద్దు చేయాలి.
– సిట్టింగ్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను తొలుత చేపట్టాలి.
– మరణశిక్ష లేదంటే ఏడేళ్ల జైలు.. అంతకు మించి జైలుశిక్ష పడటానికి వీలున్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు తొలి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది.
– నిందితులు.. సాక్ష్యులను కోర్టు ముందు హాజరుపర్చటంలో ఫెయిల్ అయితే కోర్టులు సంబంధిత పోలీసు అధికారుల నుంచి నివేదిక కోరాలి.
– నిందితుల హాజరు.. సాక్ష్యుల విచారణకు సంబంధించి కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి.
– పెండింగ్ లో ఉన్న ఈడీ.. సీబీఐ కేసుల పర్యవేక్షనను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి.
ఇలా అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులపై అప్పట్లో కొంత కార్యాచరణ నడిచింది. కానీ.. తర్వాత మళ్ల మమూలైపోయింది. ఇంకా చెప్పాలంటే.. కేసుల విచారణ పూర్తిగా మందగించింది. ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చింది.
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతున్న క్రిమినల్ పాలకలు !
దారుణమైన హత్య కేసుల్లో జైల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించిన సందర్భాలు చూస్తున్నాం. బెయిల్ పై బయకు వచ్చి న్యాయవ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకుని అసలు కేసుల విచారణలు జరగకుండా చేయడమే కాదు.. అన్ని వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. సాక్షాత్తూ కాబోయే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ లెటర్లు రాయడమే కాకుండా.. వాటిని దురుద్దేశపూర్వకంగా బయటకు విడుదల చేసి న్యాయవ్యవస్థను బలహీనం చేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగని క్రిమినల్ పాలకులు.. తమ బురద అందరికీ పూయాలని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఏపీ లాంటి రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలపై అరవై వేల కేసులు పెట్టారంటే… ఏ స్థాయిలో వ్యవస్థలు దుర్వినియోగం అయ్యాయో.. అర్థం చేసుకోవచ్చు. వందల మంది కనీస ఆధారాలు లేకుండా అరెస్టు అయ్యారు. రోజుల తరబడి జైళ్లలో ఉండాల్సి వచ్చింది. ఏ ఒక్క వ్యవస్థ కూడా క్రిమినల్ పాలకుడ్ని అడ్డుకోలేకపోయింది. ఈ వైఫల్యం ఎవరిది ?. క్రిమినల్స్ ను ఎందుకు జైల్లో పెడతారు ? వారు బయట ఉంటే అలాంటి క్రిమినల్ పనులు చేస్తారని..జైల్లో మారు మనసు పొందుతారని. కానీ రాజకీయ బలం ఉన్న వారిని బయటే ఉంచి.. వారి చేతికి వ్యవస్థలు వెళ్లేలా చేయడం వల్ల.. మొత్తం సమాజం నష్టపోతోంది.. శిక్షకు గురవుతోంది. ఈ పరిణామాలు ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్‌లోనూ తీవ్రంగా ఉంటాయి. భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు ఇప్పటికైనా చురుగ్గా వ్యవహరించి.. తమ ఆదేశాలను అయినా పాటించేలా చూస్తే.. ప్రజాస్వామ్యానికి పట్టిన అతిపెద్ద వైరస్‌కు వ్యాక్సిన్ వేసినట్లవుతుంది. లేకపోతే అది పాలిటిక్స్ కు పరిష్కరించలేని వ్యాధిగా మారుతుంది.అప్పుడు మన దేశంలో ఉండేది.. ప్రజాస్వామ్యం కాదు.. క్రిమినలిజం.
ప్రజలూ తిరగబడాల్సిన సమయం
వ్యవస్థలు కాపాడాలి..కాపాడతాయి అని ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. ముందు ఓటర్లు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. క్రిమినల్స్ ని ఎన్నుకుని వాళ్ల నుంచి రక్షణ కావాలని వ్యవస్థల దగ్గరకు వెళ్తే… ఆ వ్యవస్థలను కూడా ప్రజలు అధికారం ఇచ్చిన క్రిమినల్స్ గుప్పిట పట్టుకుంటారని గుర్తుంచుకోవాలి. అందుకే ఓటు అనేది ఓ పథకానికి లేదా ఓ నోటు కోసం ఇచ్చేసే విలువలేని హక్కు కాదు. అది తలరాతను మార్చేది. చూసి వాడుకోవాలి. ప్రలోభాలకు వాడితే… ఓ ఓటే పామైకరుస్తుంది. ఇప్పుడది చూస్తున్నాం.