మంచు విష్ణు జిన్నా పేరుతో తీసిన సినిమాను మూడు, నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. కనీస మాత్రం కూడా కలెక్షన్లు రాకపోగా ధియేటర్లకు ఎదురు రెంట్లు కట్టుకోవాల్సి వచ్చింది. అంటే సినిమా బడ్జెట్తో పాటు దాన్ని ప్రదర్శించుకోవడానికీ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు 10 లక్షలకు అటూ ఇటూగానే ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ రోజున సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన విష్ణు టీం ఖర్చు దాదాపుగా అంతే అయి ఉంటుంది. అంటే తొలి రోజు వచ్చిన కలెక్షన్లంత ఖర్చు పెట్టి విజయోత్సవాలు నిర్వహించి ఉంటారు. మరి ధియేటర్ల రెంట్లు ఎవరు కడతారు?
మంచు వారిని చూసేందుకు సిద్ధంగా లేని ప్రేక్షకులు !
సినిమా ఏమైనా సన్నాఫ్ ఇండియాలా నాసిరకంగా తీశారా అంటే .. అదేమీ లేదు. మంచి నటులున్నారు. మాస్ ప్రేక్షకుల్ని ధియేటర్కు రప్పించేలా పాయల్ రాజ్ పుత్ , సన్నీలియోన్లతో సరసాలు ఆడించారు. పక్కా కమర్షియల్ ఫార్ములాతో తీశారు. ఇలాంటి సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా చూసేందుకు వచ్చే వారుంటారు. కానీ వారు కూడా జిన్నాకు రాలేదు. దీనికి కారణం విశ్లేషించుకుంటే.. మంచు కుటుంబమే మైనస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిపై జనానికి విరక్తి పుట్టేలా వారే చేసుకున్నారు. అతి ప్రవర్తనతో తమ మూలాలను పెకిలించేసుకున్నారు.
డబ్బులుండి తీసుకోవచ్చు కానీ దాని వల్ల ప్రయోజనం ఏంటి ?
త్వరలో మోహన్ బాబు- లక్ష్మి ప్రసన్న సినిమా కూడా రాబోతోంది. ఆ తర్వాత మోహన్ బాబు మలయాళంలో వచ్చిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ అనే సినిమాను రీమేక్ చేస్తారట. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలు చూడటం ఎక్కువైపోయింది. ఆండ్రాయిడ్నూ చూసి ఉంటారు. అందులో మోహన్ బాబును ఊహించుకుంటే… ఉలిక్కిపడటం ఖాయం. డబ్బులు ఉండవచ్చు.. కావాల్సినన్ని సినిమాలు తీసుకోవచ్చు.. కానీ చూసేదుకు ప్రజలు సిద్ధంగా లేరని తేలిపోయింది.
సినిమాల్లో ప్రేక్షకుల నమ్మకం కోల్పోయిన మొదటి ఫ్యామిలీ !
సినిమాలు ఎవరైనా నచ్చితేనే చూస్తారు. అభిమానం కోసం ఒక సారి చూస్తారు. ఇలా చూసే వారికి నచ్చితేనే రెండో సారి చూస్తారు. ఇలాంటి ఫ్యాన్స్ మోహన్ బాబుకూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు లేరు. వారి అభిమాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం మోహన్ బాబు చేయడంతో వారంతా దూరమయ్యారు. ఇలా అభిమానుల నమ్మకాన్ని కోల్పోయిన మొదటి ఫ్యామిలీ మంచుదే.