యువగళం పాదయాత్ర యాభై రోజులయింది. కుప్పం నుంచి ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గం వరకూ వచ్చారు. ఈ యాభై రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పట్టభద్రులు టీడీపీ వైపు ఉన్నట్లుగా తేలింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాయలసీమలోనివే. అందులోనూ పులివెందుల నుంచి మెజార్టీ సాధించడం అనూహ్యమైన విషయం. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనీ సాధించారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో….. మెల్లగా అవన్నీ తగ్గిపోవడం ప్రారంభించాయి. టీడీపీకి యాభై రోజుల్లోనే ఊపు కనిపిస్తోంది. యువగళం పాదయాత్ర వల్లనా కాదా అన్న సంగతి పక్కన పెడితే యువగళం కూడా ఓకారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
లోకేష్ అంటే ఎవరు.. ఆయనేమిటి అన్నది ప్రజలకు తెలుస్తోంది. యాభై రోజుల పాటు ప్రజల్లో ఉన్న ఆయన… తన తాత తండ్రులు ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా చేశారని .. తనను తాను పై నుంచి దిగి వచ్చిన వాడిగా ప్రజెంట్ చేసుకోలేదు. వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు. ఎవరికైనా ఒక్క నిమిషం సెల్ఫీలు దిగాలంటేనే ఎంతో చిరాకేస్తుంది. అలాంటి గంట పాటు సెల్పీలు ఇస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన పాదయాత్ర తీరు చూసి .. లోకేష్ పట్టుదలకు ఫిదా అవుతున్నారు. పాదయాత్రలో అన్ని వర్గాలతో సమావేశం అవుతున్నారు. అందుకే యాభై రోజుల్లో పాదయాత్ర ఎఫెక్ట్ అంతర్లీనంగా ఎక్కువగా ఉంటోంది
మొదట్లో పాదయాత్ర ను అడ్డుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ప్రయత్నం చేసింది. యాత్రను ఆపలేకపోయినా కనీసం మాట్లాడకుండా చేయాలనుకున్నారు. మైక్ లేకుండా స్టూల్ ఎక్కి మాట్లాడుతూంటే దాన్నీ లాగేసుకున్నారు. కానీ అంత పిల్ల చేష్టలు చూసి జనం నవ్వుకుంటున్నారని తెలిసి మెల్లగా అలాంటివి మానేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పూర్తిగా సహకరించడం ప్రారంభించారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న అనూహ్య స్పందనతో అణిచి వేసే ప్రయత్నం చేస్తే మరింత సమస్య వస్తుందని ప్రభుత్వ పెద్దలు కూడా వెనక్కి తగ్గిట్లుగా తెలుస్తోంది.
మొత్తం నాలుగు వందల రోజుల పాదయాత్రలో యాభై రోజులు మాత్రమే పూర్తయింది. ఇప్పటికే ఎన్నో ప్రతికూలతలు అధిగమించి ఇతర పార్టీలు చేసే దుష్ప్రచారాలను చిరునవ్వుతో అధిగమిస్తూ… ప్రజల్లోనే ఉంటూ పయనం సాగిస్తున్నారు.