భారతీయ జనతా పార్టీపై ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని… దాన్ని తిప్పికొట్టేందుకు.. ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి వస్తున్నారని.. బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అసలు కేంద్రం ఏం చేసిందో చెబుతామని.. భారీ ప్రకటనలు చేశారు. స్టేజీకి కూడా సత్యమేవ జయతే అని పేరు పెట్టారు. అందుకే.. నరేంద్రమోడీ ఏదో ఇచ్చి ఉంటారు. అది చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ.. ఆయన మాత్రం.. బీజేపీ నేతల్లోనే.. “తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లకు చెప్పండి.. తెలియని వాళ్లు.. తెలిసిన వాళ్లను అడగండి.. అన్న పద్దతిలో స్పీచ్ ఇచ్చి వెళ్లిపోయారు.” ఓ రకంగా.. బీజేపీ గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. అంటే.. ఇక చెప్పుకోవడానికి చంద్రబాబుపై ఆరోపణలే తప్ప.. బీజేపీ దగ్గర..మోడీ దగ్గర సరుకు లేదని ఈ సభతో వాళ్లే తేల్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గత ఎన్నికలకు ముందు ఏపీకి వచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో అనేక వాగ్దానాలు చేశారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. ఆ వాగ్దానాల విషయంలో ఒక్క మాటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయాలేమీ తనకు తెలియదన్నట్లుగా చంద్రబాబును తిట్టేసి.. వెళ్లిపోతే పనైపోతుందన్నట్లుగా… ఓ ప్రధానిగా.. ఉన్నాననే విషయాన్ని కూడా మరిచి.. అత్యంత బాధ్యతారాహిత్యమైన రాజకీయాన్ని మోడీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు… విభజన చట్టంలోని ప్రతి అంశంపైనా… క్లారిటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ.. ఆయన మాత్రం.. ఏదో ఇచ్చామంటూ.. కొన్ని కేంద్ర సంస్థల పేర్లు మాత్రమే చెప్పారు. అసలైన డిమాండ్ల విషయంలో నోరు మెదపలేదు.
ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదు..? ప్యాకేజీ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వలేదు..?. ఆర్థికంగా భారం కాకపోయినా రైల్వేజోన్ ఎందుకివ్వలేదు.. ?
స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదు..?. పోర్టు విషయంలో ఒక్క అడుగు ఎందుకు ముందుకేయలేకపోయారు..? . లోటు భర్తీ విషయంలో కొర్రీలెందుకు పెడుతున్నారు..?. పెట్రోలియం కాంప్లెక్ ఏమైంది..? . ట్రైబల్ యూనివర్శిటీ సంగతేమిటి..?. ఢిల్లీని మించిన రాజధానికి రూ. 1500 కోట్లా..?. వెనుకబడిన జిల్లాలకు నిధులేమయ్యాయి..?. ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపుగా విభజన చట్టం మొత్తం లెక్కలోకి వస్తుంది. కానీ.. ఒక్కటంటే.. ఒక్కదానికి మోడీ సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన ప్రసంగం మొత్తం.. రాజకీయం చేశారు. తన నోటితో.. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాటి గురించి కనీసం ప్రస్తావించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ ఆయన మాత్రం.. అన్నింటినీ మర్చిపోయారు.