ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ప్రశాంత్ కిషోర్ ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు ?. జగన్ రెడ్డిని ఎందుకు వదిలేశారు ?. పీకేపై గతంలో అనేక విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఎందుకు ఆయనను స్ట్రాటజిస్టుగా నియమించుకుంటోంది ? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి.
పీకే క్లయింట్ బేస్డ్ స్ట్రాటజిస్ట్ మాత్రమే !
ప్రశాంత్ కిషోర్ ఎవరు ? ఆయన ఓ స్ట్రాటజిస్ట్. ఆయనకు రాజకీయంగా ఏమైనా అభిప్రాయాలుంటే.. అది బీహార్ వరకే పరిమితం. ఇంకా చెప్పాలంటే ఆయన తన రాజకీయాల్ని.. వృత్తిని కలుపుకుంటారని ఎవరూ అనుకోరు. వృత్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అంటే చేసే పనిని తన వ్యక్తిగత ఆసక్తులతో సంబంధం లేకుండా వంద శాతం నిర్వహిస్తారు. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు ఇలా అందరూ పనిని పనిగా చేసుకుంటారు. అలా చేయగలిగినప్పుడే విజయవంతం అవుతారు. పీకే అలా పొలిటికల్ స్ట్రాటజిస్టుగా తన వృత్తికి న్యాయం చేస్తారు. ఈ క్రమంలో టీడీపీనా వైసీపీనా అన్నది కాదు..తన క్లయింట్ కు న్యాయం చేయాలనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తనకు జగన్ పై ప్రత్యేక అభిమానం ఉండదు.. టీడీపీపైన ఉండదు. ఆయన వృత్తి కోసం టీడీపీకి పని చేస్తున్నారంతే.
వైసీపీ విమర్శలు వారి ఆందోళనకు సాక్ష్యం !
ప్రశాంత్ కిషోర్‌ను జగన్ రెడ్డి విన్నింగ్ మాడ్యూల్ గా చూశారు. తనపై ఆయనకు నమ్మకం లేదు. ఎవరో వస్తారని గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశలకు తగ్గట్లుగా ప్రశాంత్ కిషోర్ కనిపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలని అహోరాత్రులు శ్రమించి పార్టీ గురించి పట్టించుకోకపోతే… దాన్నే అవకాశంగా మల్చుకుని … జగన్ రెడ్డికి కావాల్సిన అవుట్ పుట్ ఇచ్చి పీకే గెలిపించారు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పీకేని జగన్ రెడ్డి తనతో కంటిన్యూ అయ్యేలా చేసుకోలేకపోయారు. దానికి ఎవరిది తప్పు ?. ఇప్పుడు ఆయన చంద్రబాబు వైపు వస్తే.. బీహారీ దొంగ అని నిందిస్తున్నారు.. పీకేను తిట్టడం వల్ల… వైసీపీకి వచ్చేదేమీ ఉండదు… కానీ.. వారి క్యారెక్టర్ పై మరకపడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. పీకే చంద్రబాబు వైపు వెళ్లడం వల్ల మొదటికే మోసం వచ్చినట్లుగా అయిందన్న వారి కంగారు బయట పడుతోంది.
పీకే టీడీపీ స్ట్రాటజిస్టుగా పని చేస్తారా ?
ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ లో సొంతపార్టీ పెట్టుకున్నారు. పాదయాత్ర చేశారు. ఐ ప్యాక్ తో సంబంధం లేదని చెబుతున్నారు. మరి ఇప్పుడు టీడీపీకి ఫుల్ టైం స్ట్రాటజిస్టుగా పని చేస్తారా అంటే అలాంటిదేమీ ఉండదని .. ప్రస్తుతం టీడీపీకి పని చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీచెబుతోంది. కానీ ప్రశాంత్ కిషోర్ సలహామేరకే సోషల్ మీడియా క్యాంపెయినింగ్ నడుస్తుందని చెబుతున్నారు. అంటే సలహాదారుగా ఉంటారన్నమాట.
మోరల్‌గా వాతలు పెట్టుకుంటోందన్నది వైసీపీనే !
పీకే – చంద్రబాబు భేటీపై అతి స్పందించి వాతలు పెట్టుకుంటున్నది వైసీపీనే. పీకేని హైర్ చేసుకోవడం… టీడీపీ తప్పు అని ప్రచారం చేస్తే.. మరి ఇప్పటి వరకూ మీరు చేసింది తప్పేనా అని.. ఎవరి మనసులో అయినా ప్రశ్న వస్తుంది. కానీ ఏదో ఒకటి తిట్టేయాలన్న లక్ష్యంతో ఉండే వైసీపీ నేతలకు ఇది అర్థం కావడం లేదు. ప్రశాంత్ కిషోర్ ను హైర్ చేసుకోవడం… ఆయన ఒప్పుకుంటే.. ఒప్పందం చేసుకోవడానికి రెండు పార్టీలకు అభ్యంతరం లేకపోతే… అందులో తప్పేముంది ? . వచ్చే లాభనష్టాలు వారే భరిస్తారు. అనవసర విమర్శలు చేసి.. హైప్ ఇవ్వడం తప్ప.. వైసీపీకి వచ్చేదేమీ ఉండదు.