బిల్లులో లోపాలున్నాయని.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అందుకే వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. లోపాలున్న బిల్లునే ఆమోదించారు. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అవి కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు లోపాలను గుర్తించడం ఓ విశేషం అయితే.. అసలు బిల్లు ఉపసంహరణ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న .. చేసిన వాదనలు మరీ విచిత్రంగా ఉంటున్నాయి. పరస్పర విరుద్ధమైన భిన్న వాదనలు వినిపించడం ముఖ్యమంత్రికే సాధ్యం అయింది.
సూపర్ కాపిటల్ కావాలా..? వద్దా?
అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడం వల్ల .. సమస్యలు వస్తున్నాయని అందుకనే పరిపాలనా వికేంద్రీకరణ అని సీఎం చెబుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ఓ సూపర్ కాపిటల్కు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. స్థానిక ఎన్నికల్లో అదే తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ జగన్ మళ్లీ విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిందని.. ఐదేళ్లు దృష్టి పెడితే హైదరాబాద్‌లో పోటీ పడుతుందని అంటారు. అంటే విశాఖను సూపర్ కాపిటల్ చేస్తామంటారు. అసలు సూపర్ కాపిటల్కు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారంటారు.. మళ్లీ విశాఖను అలాగే చేస్తామంటారు..! మీకెవరికైనా అర్థం అవుతుందా ?
97శాతం మందికి ఆమోదిస్తే ఇంకెవరికి అవగాహన కల్పిస్తారు ?
అన్ని వర్గాలకు నచ్చ చెప్పి.. అందరి ఆమోదయోగ్యంతో మూడు రాజధానుల బిల్లులు తెస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ భాగస్వాములతో చర్చించలేదన్న విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే అదే తన ప్రసంగంలో సీఎం జగన్ కానీ.. బిల్లుల ఉపసంహరించుకున్న బుగ్గన కానీ తన ప్రసంగంలో మూడు రాజధానులకు 97 శాతం ప్రజల మద్దతు ఉందని చెప్పుకున్నారు. బహుశా.. వారు తమకు స్థానిక ఎన్నికల్లో వచ్చిన చైర్మన్, మేయర్ సీట్ల శాతాన్ని బట్టి అలా అర్థం చేసుకుని ఉండవచ్చు. అదే నిజం అయితే ఇఫ్పుడు మళ్లీ ఎవరికి అవగాహన కల్పిస్తారు. ఆల్ రెడీ తీర్పు ఇస్తే ఇక అవగాహన కల్పించడం ఎందుకు?. ఎవరికైనా అర్థం అవుతుందా ?
సమగ్ర అధ్యయనం లేకుండా బిల్లు తెచ్చి ఇంత రచ్చ చేశారా ?
అసెంబ్లీలోచట్టాలంటే ఆషామాషీ కాదు. ఓ సమగ్రమైన అధ్యయనం ఉండాలి. రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఏ ప్రభుత్వమైనా అదే చేయాలి. కానీ సమగ్ర అధ్యయనం చేయడానికే పాత బిల్లులు ఉపసంహరించుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. అంటే పాత చట్టాలను సమగ్ర అధ్యయనం చేయకుండా తీసుకొచ్చాం అని ఒప్పుకుంటున్నట్లయింది. మళ్లీ లోపాల్లేవని.. ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని అంటారు. అసలు ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో ఎవరికికైనా అర్థం అవుతోందా ?
ఏం చెప్పినా సమర్థించే మూర్ఖులున్నంత కాలం రాజకీయాలు ఇలాగే !
ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర రాష్ట్రాల సూపర్ క్యాపిటల్స్‌కు వెళ్లాల్సిందేనా అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అదే సూపర్ క్యాపిటల్‌ను మన రాష్ట్రంలో ప్రజలు వద్దని తీర్పు చెప్పారని అంటారు. ఎవరికీ అర్థం కాదు. కానీ ఆలోచించలేని స్థాయికి ఓ వర్గం ప్రజల్ని… సోషల్ మీడియా సాయంతో తీసుకెళ్లిపోయిన తర్వాత ఇలాంటి అడ్డగోలు వాదనలు ఎన్ని చేసినా సమర్థించేవారు సమర్థిస్తూనే ఉంటారు. విషాదం ఏమిటంటే వీరిలో చదువుకున్నామని చెప్పుకునేవారు.. మేధావులుగా చెలామణి అయ్యే వారూ ఉంటారు. అందుకే ఇలాంటి రాజకీయ నేతల ఆటలు సాగుతూనే ఉంటాయి.