తెలంగాణను సాధించడం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అంతర్థానం అయిపోయింది. ఆ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఏర్పడింది. వేర్పాటు వాద భావజాలంతో ఏర్పడిన పార్టీ.. మన రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు.. ప్రజలను భావోద్వేగాలకు సులువుగా రెచ్చగొట్టగలిగే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ తాను అనుకున్నది సాధించారు. ఎనిమిదేళ్లు పరిపాలించారు. ఆయనకు దేశం మొత్తం పాలించాలన్న కోరిక పుట్టింది. అంతే తన మూలాల్ని వదిలేసి.. దేశం పైకి బయలుదేరారు. కానీ కేసీఆర్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. తన పునాదుల్ని తానే పెకిలించుకున్నారని తెలుసుకోవడం.
తెలంగాణ లేని కేసీఆర్ను ఎవరూ గుర్తించరు !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమే అండగా నిలిచింది. మరి ఇప్పుడు కేసీఆర్ ఆ తెలంగాణను ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశఆరు. ఇక నుంచి తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పలేరు. అంటే కేసీఆర్ తన పునాదుల్ని తానే వీక్ చేసుకున్నట్లు.
తెలంగాణకు పేగు, పేరు బంధాలు తెగిపోయినట్లే !
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం.. తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. కేసీఆర్ ను తెలంగాణ వ్యక్తిగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంగీకరించరు. ఆయన మూలాలు బీహార్లో ఉన్నాయని.. పూర్వీకులు విజయనగరం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. దీన్నే గుర్తు చేస్తూ.. కేసీఆర్కు తెలంగాణతో పేగుబంధం లేదని.. ఇప్పుడు పేరు బంధం కూడా తొలగించుకున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని మండిపడ్డారు. ఇవి రాజకీయ విమర్శలే కానీ.. నిజంగా చాలా మందిది అదే అభిప్రాయం. కేసీఆర్ తెలంగాణను వదిలేస్తున్నారని నమ్ముతున్నారు.
ప్రతీ సారి అద్భుతాలు జరగవు.. !
తెలంగాణ ఏర్పాటు ఓ అద్భుతం. చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కేసీఆర్ పట్టుదలతో ప్రయత్నించడం వల్ల అది సాధ్యమయింది.అయితే కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదు. కానీ ఆయనకు క్రెడిట్ వచ్చింది. ప్రతీ సారి అలాంటి అద్భుతాలు కోరుకోవడం అత్యాశే. ఎందుకంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని ప్రజల్లో నిగూఢంగా ఉన్న కోరికను వెలికి తీయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా ప్రజల్ని తన వైపు చూసేలా చేసుకోవడం అంత తేలిక కాదు. ఏదో గాల్లో రాయి వేద్దమనుకుంటే ట్రై చేయవచ్చు కానీ.. ఇక్కడ పునాదులు కదిలిపోతే.. తర్వాత చరిత్ర మారిపోతుంది.