వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒకే సారి విడుదల చేశారు. ఇందులో… 41 మంది బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. 29 ఎస్సీ రిడర్వుడు, 7 ఎస్టీ నియోజకవర్గాల్లో ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. అవి కాకుండా.. ఇవి కాకుండా.. మిగతా 98 నియోజకవర్గాల్లో సగానికిపైగా.. రెడ్డి సామాజికవర్గానికి కేటాయించారు. 98 మందిలో 51 మంది రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులే ఉన్నారు. మిగతా 47 మంది.. ఇతర ఓసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ముస్లిం, కమ్మ, బలిజ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు చెందిన వారు ఈ జాబితాలో ఉన్నారు.
రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 33 మంది రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులకు జగన్ టిక్కెట్లు ఇచ్చారు. ఇంకా 9 రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో వారికి తప్ప వేరే వారికి అవకాశం ఇవ్వలేదు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో రెండు చోట్ల ముస్లింలకు అవకాశం కల్పించారు. ఆరుగురు బీసీ అభ్యర్థులకు మాత్రమే చాన్సిచ్చారు. కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు రిజర్వుడు స్థానాలు. మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఏడు చోట్ల రెడ్లకు అవకాశం కల్పించారు. ఒక్క చోట్ల ముస్లిం అభ్యర్థి చాన్స్ ఇచ్చారు. కడప నగరంలో అంజాద్ బాషాకు టిక్కెట్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు రిజర్వుడు కాగా.. మిగిలిన పదకొండింటింలలో.. ఏడు చోట్ల రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించారు. అనంతపురంలో 14 నియోజకవర్గాలు ఉండగా.. రెండు రిజర్వుడు. మిగిలిన పన్నెండు చోట్లలో తొమ్మిది మంది రెడ్లకు అవకాశం కల్పించారు. రెండు మాత్రమే బీసీలకు ఇచ్చారు. కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఏకంగా పది చోట్ల రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులకు ఇచ్చారు. రెండు రిజర్వుడు కాగా.. ఒక్కటి మాత్రం ముస్లింలకు ఇచ్చారు.
బీసీ గర్జన పెట్టి.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న జగన్… 175 నియోజకవర్గాల్లో ఒకే కులం అయిన… రెడ్డి సామాజికవర్గానికి 51 సీట్లు కేటాయించారు… 50 శాతానికిపైగా జనాభా ఉన్న బీసీ వర్గాలకు మాత్రం కేవలం 41 స్థానాలు మాత్రమే కేటాయించారు. ఇక ఇతర ఓసీ వర్గాలకూ… ప్రాధాన్యం ఇవ్వలేదు. దాంతో… వైసీపీలో సామాజిక న్యాయం కేవలం.. రెడ్డి వర్గానికి మాత్రమే దక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.