తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ వర్సిటీకి చైర్మన్ గా టెక్ దిగ్గజం అనంద్ మహింద్రాను నియమిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. ఎన్నారైలతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని తమ విజ్ఞప్తి పట్ల ఆనంద్ మహింద్రా సానుకూలంగా స్పందించారు..రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారని తెలిపారు.
టెక్ మహింద్రా వర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఇటీవలే హైదారాబాద్ కు వచ్చిన ఆనంద్ మహింద్రా గ్రూప్ సంస్థల అధినేత మహీంద్రా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పోతున్న స్కిల్ యూనివర్సిటీ పై వీరి మధ్య ఆ సమావేశంలోనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వర్సిటీకి చైర్ పర్సన్ గా వ్యవహరించాలని కోరగా.. ఇందుకు తన సమ్మతిని తెలియజేశారని..ఆయనే రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.
రంగారెడ్ది జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరి కంచె వద్ద స్కిల్ యూనివర్సిటీ భవనానికి సీం గత వారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్సిటీలో 17రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడమే ఈ స్కిల్ వర్సిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.
కాగా, రానున్న కాలంలో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా వర్సిటీని విస్తరించనున్నారు. ప్రస్తుతం కొత్త భవనం అందుబాటులోకి వచ్చే లోపు గచ్చిబౌలిలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి కార్యకలాపాలు కొనసాగనున్నాయి.