దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ మెల్లగా కేసుల నమోదు ఎక్కువ అవుతోంది. ఈ సమయంలో కొత్త వేరియంట్ కి కూడా తన వద్ద మందు ఉందని నెల్లూరు ఆనందయ్య ప్రకటించారు. ఒమిక్రాన్ మాత్రమే కాదు మరో 50 రకాల కొత్త వైరస్ లు పుట్టుకొచ్చినా మందులిస్తామని చెబుతున్నారు. నెల్లూరు ఆనందయ్య అంటే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేనంత పబ్లిసిటీని కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే ఆయన సంపాదించారు.
ఆయన మందు వల్ల నిజంగా కరోనా తగ్గిందా లేదా అన్నదానిపై ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాల్లేవు. నమ్మకం అంతే. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత మెల్లగా ఆయనను కూడా జనాలు మర్చిపోవడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దాంతో ఆనందయ్య మళ్లీ తెర ముందుకు వచ్చారు. ఆ వైరస్ను రెండు అంటే రెండు రోజుల్లో నయం చేసి చూపిస్తానని ఆనందయ్య సవాల్ విసురుతున్నారు. ఈ విషయాన్ని మీడియాను పిలిచి మరీ చెప్పారు.
కొన్ని మీడియా సంస్థలు ఆయనను పిలిచి ఇంటర్యూలు.. గట్రా చేస్తున్నాయి. ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆయన మందుకు అనుమతి ఇవ్వలేదని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో సమర్థించిన అందరూ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు.