అనంతపురం జిల్లా టీడీపీ బాధ్యతల్ని తమకు చంద్రబాబు ఇచ్చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకున్నారు. తాడిపత్రిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇన్ని రోజుల అనంతరం కార్యకర్తలకు స్వేచ్చ ఇచ్చారని ప్రకటించుకున్నారు. చంద్రబాబు ఫోటోతో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జిల్లా మొత్తం తిరుగుతామని ప్రకటించారు. చంద్రబాబు అలా చాన్స్ ఇచ్చారో లేదో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకున్నారో కానీ ఇప్పుడీ విషయం టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది.
అనంతపురం జిల్లాలో టీడీపీకి దిగ్గజ నేతలున్నారు. సీనియర్లు ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వేలు పెట్టడానికి అంగీకరించరు. జేసీ సోదరులు వేలు పెట్టడానికి అసలు అంగీకరించరు. ఇటీవల పుట్టపర్తి వెళ్లి పల్లెరఘునాథ రెడ్డి అభ్యర్థిత్వంపై వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ తో పాటు పలు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతున్నారు. చివరికి కాల్వ శ్రీనివాస్‌కు కూడా టిక్కెట్ వద్దంటున్నారు. ఈ పరిస్థితుల్లో జేసీని హద్దుల్లో ఓ ఉండాలని ఓ సారి అచ్చెన్నాయుడు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
అయితే జేసీ కుటుంబం జగన్ ప్రతీకార రాజకీయాలకు దారుణంగా దెబ్బతిన్నారు. ఎలాగైనా దెబ్బకు దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉన్నారు. వారి వ్యాపారాలన్నింటినీ జగన్ దెబ్బకొట్టేశారు. బస్సులు.. లారీలు తిరగడం లేదు. మైనింగ్ బిజినెస్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఇతరుల కన్నా జేసీ బ్రదర్స్ కసిగా ఉన్నారని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కాస్తంత ఎక్కువ చొరవ తీసుకునే స్వేచ్చ ఆయనకిస్తారని భావిస్తున్నారు. అయితే సీనియర్లను సమన్వయం చేసుకోకపోతే అనంత టీడీపీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.