సూపర్ స్టార్ మహేష్-దర్శకుడు వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా మహర్షి. అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారడం, ఇలాంటి వ్యవహారాలేవో వున్నాయి. ఆ మాటకు వస్తే, ఓ అత్యంత దనవంతుడైన వ్యాపారవేత్త కోట్ల నష్టపోయి మహర్షిలా మారిన పాయింట్ తో రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ఎప్పుడో మహర్షి అనే నవల రాసారు. అది వేరే సంగతి.
సరే, పాయింట్ కు వస్తే, ఏప్రియల్ 25న మహర్షి విడుదలకు ముహుర్తం పెట్టారు. కానీ ఇప్పుడు ఇదే ఆ సినిమాకు ఇబ్బంది అవుతుందేమో అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు త్వరలో రాబోతోంది. ఆంధ్రలో ఏప్రియల్ 20 నుంచి 30 మధ్యనో లేదా 20 నుంచి మే ఫస్ట్ వీక్ మధ్యనో ఎన్నికల హడావుడి వుంటుందని వినిపిస్తోంది.
కీలకప్రచారం ఏప్రియల్ ఆఖరివారంలోనే వుండొచ్చని అంచనా. ఎన్నికల టైమ్ లో సినిమాలకు పెద్దగా గిరాకీ వుండదని ట్రేడ్ వర్గాల బోగట్టా. ముఖ్యంగా ఈసారి ఆంధ్ర ఎన్నికలు చాలా పోటా పోటీగా జరగబోతున్నాయి. మూడు పార్టీలకు ప్రచారానికి జనం కావాలి. సినిమాకు వెళ్తే ఖర్చు. అదే ప్రచారానికి వెళ్తే ఆదాయం.
మరి మహర్షి డేట్ ను మే ఫస్ట్ వీకు మారుస్తారా? లేక జనాల దగ్గర ఎన్నికల డబ్బులు బాగా ఆడతాయి కాబట్టి , సినిమాకు బాగుంటుందని అనుకున్నడేట్ కే ముందుకు వెళ్తారా? చూడాలి.