ఓ చరిత్రని సినిమాగా మలచడం చాలా కష్టం. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. కల్పన జోడిస్తే… చరిత్రని వక్రీకరించినట్టు అవుతుంది. రెండింటినీ సమతుల్యం పాటించడం చాలా కష్టం. ‘ఎన్టీఆర్’ విషయంలో సమతుల్యత కనిపించినట్టే కనిపించినా… క్రమంగా ఈ సినిమాలో చేసిన తప్పులు, పొరపాట్లు, లోపాలు ఇలా ఒకొక్కటీ బయటకు వస్తున్నాయి. తాజాగా అసలు ఎన్టీఆర్ బయోపిక్‌ని ఉన్నది ఉన్నట్టుగా తీశారా? చరిత్రని వక్రీకరించారా? అనే విషయంలో ఓ సుదీర్ఘమైన వ్యాసాన్ని ప్రచురించింది ప్రముఖ దిన పత్రిక ఆంధ్రజ్యోతి. అందులో లేవనెత్తిన హైలెట్స్ ఇవే.
- ఎన్టీఆర్ కాలేజీ చదువులు పూర్తి చేసింది, ప్రభుత్వోద్యోగం చేసింది గుంటూరు పట్నంలో. కానీ సినిమాలో మాత్రం ఆయన ఉద్యోగం చేసింది మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంగా చూపారు.
- 1947 నవంబర్‌లో కీలకమైన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సన్నివేశం జరిగినట్లు చూపించారు. ఆ రోజు ఎన్టీఆర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే రోజు ఎన్టీఆర్, బసవతారకం దంపతుల పెళ్ళి రోజు అని కూడా చెప్పారు. నిజానికి, వాళ్ళ పెళ్ళి రోజు… మే 21. ఈ విషయం రికార్డులలో ఉంది.
- లంచం సీన్ ఈ సినిమాలో బాగా పండింది. డైలాగులూ పేలాయి. అయితే.. స్వాతంత్రం వచ్చీ రాగానే జరిగే ఆ ఆఫీసు లంచం సీనులోనే తరువాతెప్పుడో గాంధీ మరణించాక, ఆయన బొమ్మ వాటర్ మార్కుతో వచ్చిన రూపాయి నోట్లను లంచం సొమ్ముగా చూపెట్టారు.
- 1952 నాటి ‘రాయలసీమ క్షామ నివారణ నిధి’ వసూళ్ళను అప్పటి రాష్ట్ర ‘ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి సహాయనిధి’కి అందించమని ఎన్టీఆర్ పేర్కొన్నట్లు సినిమాలో చూపించారు. కానీ, నిజానికి అప్పటికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరగనే లేదు. ఎన్టీఆర్ బృందం ఊరూరా పర్యటించిన 1952 ఏప్రిల్‌కి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ. నీలం సంజీవరెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యుడు కూడా కారు!
- ప్రజల సహాయం కోసం కళాకారులు ప్రదర్శనలివ్వడం అదే తొలిసారి అన్నట్లుగా సినిమాలో నటుడు గుమ్మడి పాత్ర నోట చెప్పించారు. కానీ, నిజానికి అంతకు ముందు పృథ్వీరాజ్ కపూర్ లాంటి కళాకారులు సాంఘిక నాటక ప్రదర్శనలిచ్చి, సామాజిక ప్రయోజనాల కోసం డబ్బు వసూలు చేశారు. ఆ స్ఫూర్తితోనే రాయలసీమ క్షామ నివారణ నిధికి కళాకారుల ప్రదర్శన ఆలోచన పురుడు పోసుకున్నట్లు గుమ్మడే తన ఆత్మకథ ‘తీపి గురుతులు- చేదు జ్ఞాపకాలు’ (పేజీ 24)లో పేర్కొన్నారు.
- 1952 ఏప్రిల్‌లో దాదాపు 40 మంది ఆర్టిస్టులతో 24 రోజుల పాటు నిధి వసూలు పర్యటన జరిగింది. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే ప్రసిద్ధ గీతం (రచన వేములపల్లి శ్రీకృష్ణ) పాడారనే అర్థం వచ్చేలా బయోపిక్‌లో చూపించారు. రోమాంచిత అనుభూతినిచ్చే ఆనాటి ఆ పాటను తెరపై తొలిసారి వాడిందీ ఎన్టీఆర్ సినిమా ‘పల్లెటూరు’లోనే. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘పల్లెటూరు’ రిలీజైంది 1952 అక్టోబర్ 19న! అంతకు 6 నెలల ముందు జరిగిన టూరులో ఆ పాట, ఆ సినిమా ట్యూను, గాత్రాలతో సహా యథాతథంగా వచ్చేస్తుంది!
- బయోపిక్‌లో మనసును పిండేసే మరో సన్నివేశం… ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మశూచి సోకి, మృత్యువాత పడిన సందర్భం. 1962 మే 10న ఎన్టీఆర్ ‘దక్షయజ్ఞం’ రిలీజవగా, తరువాత రెండువారాలకు మే 17న రామకృష్ణ చనిపోయాడని తారీఖులు చెబుతున్నాయి. తరువాత ఎప్పటికో ‘ఇరుగు పొరుగు’ (1963 జనవరి 11) వచ్చింది. ‘ఇరుగు పొరుగు’ షూటింగులో ఆ సంఘటన జరిగింది నిజమే కానీ ఆఖరిరోజు షూటింగ్లో మరణవార్త వచ్చిందనడం దర్శకుడు తీసుకున్న స్వేచ్ఛ.
- ఎమర్జెన్సీ టైములో ‘అన్నదమ్ముల అనుబంధం’ ప్రింట్లను ఎన్టీఆర్ పంపే సన్నివేశం బయోపిక్స్లోని హైలెట్స్ లలో ఒకటి. వాస్తవానికి ‘అన్నదమ్ముల అనుబంధం’ రిలీజు, ప్రింట్లు పంపే వ్యవహారానికీ, దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీకీ సంబంధమే లేదు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించింది 1975 జూన్ 25న. తరువాత 9 రోజులకే… జూలై 4న ‘అన్నదమ్ముల అనుబంధం’ రిలీజైపోయింది. కాగా, రిలీజు ఎల్లుండనగా, జూలై 2 నాటికి తమిళనాట ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం రద్దయిపోయినట్టూ, ఆయన కుమారుడు స్టాలిన్‌ను కొట్టి మరీ పోలీసులు అరెస్టు చేసినట్టూ, మద్రాసులో కర్ఫ్యూ ఉన్నట్టూ, దాంతో రిలీజుకు ఇబ్బంది ఎదురైనట్టూ బయోపిక్‌లో చూపించారు. వాస్తవానికి ఎమర్జెన్సీ పెట్టిన 7 నెలల పైచిలుకు తరువాత (1976 ఫిబ్రవరి 1) కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతిపాలన పెట్టారు. ‘మీసా’ కింద స్టాలిన్‌ని కొట్టి, అరెస్టు చేసింది అప్పుడే! అవేవీ ‘అన్నదమ్ముల అనుబంధం’ ముందు జరిగినవీ కావు. రిలీజుకు అడ్డం పడినవీ కావు.
- ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య సిగరెట్ సంభాషణ గుర్తుంది కదా? అక్కినేని, తాను చాణక్య పాత్ర చేస్తానని అడిగేనాటికి ఎన్టీఆర్ ప్రకటించిన ఆ సినిమా పేరు ‘చాణక్య-చంద్రగుప్త’ కాదు… బాలకృష్ణను చంద్రగుప్తుడిగా పెట్టి, తానే చాణక్యుడిగా ఎన్టీఆర్ తీయదలచిన ‘చాణక్య శపథం’. తీరా అక్కినేని కోరడంతో, ఎన్టీఆర్ తాను చంద్రగుప్తుడిగా వేస్తూ, పేరును ‘చాణక్య – చంద్రగుప్త’గా మార్చారన్నది చరిత్ర.
- ‘దుర్యోధనుడికి ఎవరైనా డ్యూయట్ పెడతారా’ అని ఎన్టీఆర్ అడగగానే, ‘బుద్ధి ఉన్నవాడెవడూ పెట్టడ’నే సంఘటన నిజానికి జరిగింది నటుడు, రచయిత రావి కొండలరావుతో! ‘దానవీరశూర కర్ణ’కూ, కృష్ణ ‘కురుక్షేత్రం’ సినిమాల మధ్య ఆనాటి పోటాపోటీని ప్రస్తావిస్తూ, ఆ సంగతి ఆయనే ఒకచోట గతంలో రాశారు. బయోపిక్‌లో ఆ సంఘటన ఎన్టీఆర్, నృత్య దర్శకుడు చిన సత్యం మధ్య జరిగినట్లు వస్తుంది.
- ఎన్టీఆర్‌ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’గా సంబోధించి, ప్రత్యేకంగా పత్రం ఇచ్చింది 1975 ఆగస్టులో కంచి కామకోటి అనుబంధ జగద్గురు ఆదిగిరిరాజ శ్రీశైలం పీఠాధిపతులు. ఇక, ‘లవకుశ’లో ఎన్టీఆర్ రామపాత్ర పోషణ చూసి మౌనం వీడి, ఆయనకు ‘అభినవ రామరాయ’గా ప్రశస్తిపత్రం ఇచ్చి, భిక్ష పెట్టింది బెంగుళూరు సమీపంలోని శృంగేరీ పీఠాధిపతులు. ఎన్టీఆర్‌ను కర్మయోగిగా ప్రస్తావించి, స్పృశించనిచ్చింది కంచి పరమాచార్యులు అని చరిత్ర. నిడివి పరిమితుల రీత్యానో ఏమో ఆ మూడింటినీ ఒకే స్వామీజీకే ముడిపెడుతూ సినిమాలో చూపెట్టారు. ముందెప్పుడో జరిగిన సంఘటనను ఆ తరువాత ఏణ్ణర్ధానికి మొదలైన ‘అడవి రాముడు’ షూటింగుకు ముడిపెట్టారు.
ముందే చెప్పినట్టు జీవిత కథల్ని వెండి తెరపై చూపించడం మామూలు విషయం కాదు. కాస్త డ్రామా పండించడానికి దర్శకుడు, కథకుడు కాస్త స్వేచ్ఛ తీసుకుంటాడు. రెండు విషయాల్ని ఒకే సన్నివేశంలో ముడి పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడో, ఎప్పుడో జరిగిన విషయం… అక్కడ ఆపాదించబడుతుంది. ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ అలాంటి సర్దుబాట్లే జరిగాయనుకోవాలి.