కరోనా వైరస్ ఏపీ సర్కార్‌కు ఆర్థిక ఇబ్బందులే కాదు.. కొన్ని తప్పని సరిగా చేయాల్సిన పనులను కూడా.. చేయనివ్వకుండా చేసింది. ఎలాగైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో.. మార్చిలో టెన్త్ పరీక్షలను.., బడ్జెట్ సమావేశాల్ని వాయిదా వేయడం.. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ విధించడంతో ఆ రెండు పనులు పెండింగ్‌లో పడిపోయాయి. బడ్జెట్ పెట్టకపోవడంతో.. ఆర్డినెన్స్ ద్వారా నాలుగు నెలలకు సరిపోయేలా.. ఓటాన్ అకౌంట్‌ను గవర్నర్‌తో ఆమోదింప చేసుకోవడంతో గండం గడిచింది. ఈ సారి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సడలింపులను కేంద్రం ఇవ్వడంతో.. అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ లాంఛనం పూర్తి చేయాల్సి ఉంది.
ఈ నెల 16వ తేది నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. 19వ తేదిన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వర్ల రామయ్య పోటీలో ఉండటంతో ఓటిం్గ్ అనివార్యం. ఎలాగూ ఎమ్మెల్యేలు వస్తారు కాబట్టి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే పనైపోతుందని భావిస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా భయం మాత్రం అధికారులను వెంటాడుతోంది. అసెంబ్లీలో గార్డు విధులు నిర్వహించే కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.
అసెంబ్లీ వరకూ ఓకే కానీ.. శాసనమండలి విషయంలో ఏపీ సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శాసనమండలిని రద్దు చేయమని కేంద్రానికి తీర్మానం పంపారు. ఇక శాసనమండలి లేదని.. ఇద్దరు మంత్రులకు రాజ్యసభ సీట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు.. అసెంబ్లీని సమావేశపరిస్తే.. మండలిని కూడా సమావేశపర్చక తప్పదు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. మండలి విషయంలో అలాంటి సానుకూల దృక్పధంతో లేదు. ఏం చేయబోతుందో అనేది ఆసక్తికరమే..!