ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ మొదటి విడతలోనే పూర్తయిపోతుందని అనుకున్న వారికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈ సారి నాలుగో విడతకు మార్చింది. మొత్తం ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో నాలుగో విడతలో ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ జరగనుంది. గతంలో మొదటి విడతలోనే పూర్తయిపోయింది. నాలుగో విడతకు మార్చడం వల్ల రాజకీయ పార్టీలకు మరింత ఎక్కువ ఖర్చు కానుంది. ఎన్నికలషెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇక ఆపద్దర్మం కిందకే వస్తుంది.
ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకూ ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
ఇప్పటి నుంచి చూస్తే పోలింగ్ కు ఇంకా రెండు నెలల గడువు ఉంది. ఈ సమయంలో ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇప్పటికే బటన్ నొక్కిన డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయలేకపోతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నందున బ్యాంకులు ఆర్థిక సంస్థలు అప్పులు కూడా ఇవ్వవు. ఆర్బీఐ కూడా ఇవ్వకపోవచ్చు. ఈ క్రమంలో .. వచ్చే రెండు నెలలు ప్రభుత్వానికి పెను సవాల్ లాంటిదే అనుకోవచ్చు.