ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు నిర్బంధాల్ని ఛేదించారు. పెద్ద ఎత్తున తాము చలో విజయవాడ నిర్వహించాలనుకున్న బీఆర్టీఎస్ రోడ్‌కు చేరుకున్నారు. ఆ రోడ్డు మొత్తం ఎర్ర జెండాలతో నిండిపోయింది. ఉద్యోగుల నినాదాలతో మార్మోగిపోయింది. నిజానికి ఈ ఉద్యమానికి నాయకులెవరూ లేరు. ఉద్యోగ సంఘ నేతలు పిలుపు మాత్రమే ఇచ్చారు. వారెక్కడ ఉన్నారో క్లారిటీ లేదు. కానీ ఏపీలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన ఉద్యోగులు మాత్రం బీఆర్టీఎస్ రోడ్డులో కదం తొక్కారు.
జిల్లాల నుంచి వస్తున్న వారిని అడ్డుకోవడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వీలైనంత మందిని ఆపారు. కానీ ఉద్యోగుల్లో ఆగ్రహం.. దిగువ స్థాయి వరకూ ఉండటంతో అందరూ తరలి వచ్చారు. వెల్లువలా వస్తున్న వారిని ఆపడం పోలీసుల వల్ల కాలేదు. ఉద్యోగులు అని డౌట్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకుననారు కానీ.. అలా వందల మందిని తీసుకుని అలసిపోయి తర్వాత వదిలి పెట్టేశారు. ఫలితంగా ప్రభుత్వ నిర్బంధాలు ఏమీ పని చేయలేదని తేలిపోయింది.
పీఆర్సీ అంశం విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని అంటున్నారు. ప్రభుత్వ నిర్బంధంతో మొదట ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆందోళన చెందారు. ఉద్యోగులు ఎవరూ రారేమో అనుకున్నారు. అందుకే అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా చలో విజయవాడ నిర్వహిస్తామని ఉద్యోగ నేతలు చెప్పారు. కానీ ఉద్యోగుల్లో ఆగ్రహం మొత్తం బయటపడింది. ఇక ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేశారు.