ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ సామాజిక జీవితంలోనూ ఒక మహత్తర ఘట్టం 1992-93 సారా వ్యతిరేకోద్యమం. నెల్లూరులో దూబగుంట రోశమ్మ స్పూర్తితో మొదలైన ఈ ఉద్యమం తర్వాత జనవిజ్ఞాన వేదిక,యువజన మహిళా సంఘాలు స్వాతంత్ర యోధులు స్వచ్చంద సంస్థల చేరికతో ఒక సంచలనం తెచ్చింది. దేశాన్నే వూపేసింది. ఆ ప్రభావంతోనే మొదట విజయ భాస్కర రెడ్డి మద్యంపై కొన్ని ఆంక్షలు విధిస్తే ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేదం వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు.తొలి సంతకంతో అమలు చేశారు. తర్వాత కాలంలో అది ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు ఎత్తివేశారు. అదంతా గత చరిత్ర. ఇటీవల చాలా కాలంగా సమాజంలో మద్యం మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది.ప్రభుత్వాలు మద్యపానాన్నే ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తున్నాయి. బెల్టుషాపుల నిషేదం వాగ్దానంతో టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చినా ఈ బెడద విస్తరించిందే గాని తగ్గింది లేదు. ఇది శాంతి భద్రతలకు సామాజిక శాంతికి కూడా భంగకరంగా మారిపోయిన తీరు ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాల పరంగానూ సామాజిక భద్రతలేని అత్యాచారాల విజృంభణతోనూ మహిళలు ప్రధానంగా ఇందుకు బలవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎపిలో ఐద్వా, ఇతర మహిళ సంఘాలు కలసి మరోసారి మద్యపాన వ్యతిరేకోద్యమం మొదలుపెట్టాయి. గుడి బడి ప్రధాన రహదారి విచక్షణ లేకుండా పెరిగిపోయిన మద్యం దుకాణాలను తొలగించాలంటూ రాష్ట్ర వ్యాపితంగా విస్త్రతంగానే నిరసనలు మొదలైనాయి.వీటిపైన కొన్ని చోట్ల గూండాలు మరికొన్ని చోట్ల పోలీసులు దాడులు చేయడం ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. మహిళలకు మాటల్లో సానుభూతి చెబుతూనే ఈ ఆందోళన విస్తరించకుండా చూడాలన్న ఆతృత ప్రభుత్వంలో వుండటమే ఇందుకు కారణం.
పులిమీద పుట్రలా ఈ దశలో రెండు అంశాలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. హైవేల సమీపంలో మద్యం దుకాణాలు వుండరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అధిగమించడం కోసం కొన్ని హైవేలను పట్టణాలు గ్రామాల హద్దులలో డీనోటిఫై చేయడం ఒకటి. తర్వాత ఇందుకు సుప్రీం కూడా ఆమోదం తెలిపినా ఇదొక ఎత్తుగడ అనే విమర్శ వుంది. అంతకంటే కూడా తీవ్రమైంది ఎక్సయిజ్ శాఖా మంత్రి కె.ఎస్. జవహర్ టీవీ9తో బీరు హెల్త్డ్రింక్ అంటూ ఆరోగ్య ముద్రవేయడం. దీనిపై అప్పటికప్పుడే చిక్కిపోయినా మంత్రి సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. వైన్ కన్నా తక్కువ ప్రమాదమని చెప్పడం తన ఉద్దేశమని తర్వాత పల్లవి మార్చారు. మరోవైపున హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వున్న వర్ల రామయ్య హెల్త్ డ్రింక్ వాదనను సమర్థించారు. వాస్తవం ఏమంటే బీరును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది.విశాఖపట్టణం,విజయవాడల్లో ఇందుకోసం మైక్రో బ్రూవరీలను అనుమతిస్తారట.వైజాగ్ బీచ్, రిషికొండ వంటి చోట్ల బీరు యథేచ్చగా సరఫరా చేస్తారట. డ్రాట్ బీర్ అనే ఈ తరహా పానీయం బెంగుళూరు హైదరాబాద్ గుర్గావ్ వంటి చోట్ల ఇప్పటికే బాగా వినియోగంలో వుందని ఎపిలోనూ దాన్ని విస్త్రతంగా తీసుకురావాలని ఏలినవారి కల. సో.. మహిళల పోరు బాట..మంత్రి బీరుబాట అన్న మాట..