ఏపీలో రైతులు వ్యవసాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. రబీ సీజన్ లో సాగు ప్రారంభం కాకపోవడమే దీనికి సాక్ష్యం. డిసెంబర్ ఆఖరొచ్చినా సాగు సాగట్లేదు. ఇప్పటికి కావాల్సిన సాధారణ సాగు విస్తీర్ణంలో పదకొండు లక్షల ఎకరాలు తక్కువ నమోదైంది. వరి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, అన్నీ తక్కువే సాగయ్యాయి. కరువు, వర్షాభావం, డ్రైస్పెల్స్ మూలంగా ఈ తడవ ఖరీఫ్‌లో పాతిక లక్షల ఎకరాలు సేద్యం లేక బీడు పడ్డాయి. సాగైన పంటలూ దెబ్బతిన్నాయి.
ఇదే సమయంలో వచ్చిన మిచౌంగ్ తుపాను పండిన కాస్తంత పంటనూ ఊడ్చేసింది. ఖరీఫ్ నష్టాల నుంచి బయట పడేందుకు రైతాంగం రబీ పంటలపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా సాగుకు నీరివ్వబోమని చాలా చోట్ల ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలు వేయాలని సూచించింది. సబ్సిడీపై విత్తనాలిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పే ఏ ఒక్కటి అమలు చేయడంలేదు. అందుకే నమ్మడం లేదు.సాగును ఆపేశారు.
రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా డిసెంబర్ 27 వరకు 19 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. సీజన్ నార్మల్‌లో 34 శాతమే సాగు నమోదైంది. కాగా ఈపాటికి సాగు కావాల్సిన విస్తీర్ణం 30.87 లక్షల ఎకరాలు. ఆ ప్రకారం చూస్తే 62 శాతం పంటలు సాగయ్యాయి. కాగా నిరుడు ఇదే సమయానికి 26.50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది కంటే ఈ మారు ఏడు లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అంటే ఈ ఏడాది రైతులకు వ్యవసాయ ఆదాయం కూడా భారీగా తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ప్రభావం చూపనుంది.