ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ప్రధాన రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. శ్రీశైలం నిండింది.. నాగార్జున సాగర్ నిండింది. సాగర్ గేట్లు కూడా ఎత్తుతున్నారు. పులిచింతల కూడా నిండుతుంది. ఇప్పుడు కృష్ణాడెల్టాకు చింత లేదు. పోలవరం ప్రాజెక్టును వచ్చే రెండు, మూడు సీన్లలో పూర్తి చేయాలనుకుంటున్నారు. అది అందుబాటులోకి వస్తే ఇక ఏపీలో అసలు కరువు అనే మాటే వినిపించదు. గోదావరిలో ఇప్పటికే వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిపోయింది. సముద్రంలోకి వెళ్లిపోయిన నీటితో పోలిస్తే.. నీటి బొట్టంత నీరు కృష్ణా డెల్టాకు మళ్లించుకున్నారు.
వర్షాలు బాగుండి.. రిజర్వాయర్లు నిండితే.. ఆ ఏడాది రాష్ట్రానికి పచ్చని కళ వస్తుంది. పంటలు పండుతాయి. రైతు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. రైతుల ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థలోకి అంత ధనం వచ్చి పడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందుకే వర్షాలే ఆధారం అని ప్రభుత్వాలు చెబుతూంటాయి. గత ఏడాది సరిగ్గా వర్షాలు లేవు. రిజర్వాయర్లు నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టే నిండలేదు. సాగర్లోకి అతి తక్కువ వరద వచ్చింది. అందుకే గత ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది ప్రణాళిక ప్రకారం ఉన్న నీటిని రాష్ట్ర సాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటే… ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ నీటిని తరలించుకోవచ్చు. కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే రాష్ట్రానికి… ఇక తిరుగు ఉండదు.