ఓ కోర్సుకు గత ఏడాది వరకూ.. ఏడు లక్షల వరకూ ఫీజు ఉండేది. ప్రభుత్వం హఠాత్తుగా ఆ ఫీజును మూడు .. మూడున్నర లక్షలకు కుదించేసింది. అంటే.. కాలేజీలకు వచ్చే ఆదాయంలో సగానికి సగం తగ్గిపోతుందన్నమాట. అలా తగ్గించేయడమే కాదు… తనంతట తానుగా.. కాలేజీలతో సంబంధం లేకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించేసి.. విద్యార్థులను చేర్చుకోవాలని.. ఒత్తిడి చేస్తోంది. ఆ కాలేజీలేమో.. ఏమైనా చేసుకోండి.. అంత తక్కువ ఫీజులతో కాలేజీలు నిర్వహించడం మా వల్ల కాదని.. గేట్లు మూసేశారు. దీంతో.. విద్యార్థుల పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ చదవాలనుకునేవారికి ఎదురయింది.
ఏపీలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. కౌన్సిలింగ్లో ఆ కాలేజీల సీట్లను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ భర్తీ చేసేసింది. చేరేందుకు వెళ్లిన విద్యార్థులను.. ఆయా కాలేజీ యాజమాన్యాలు వెనక్కి పంపేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తమకు ఆమోదయోగ్యం కాదని.. ఆ ఫీజులతో కాలేజీలను నడపలేమని .. సీట్ల భర్తీ చేపట్టలేదు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నోటీసులు జారీ చేసింది. కానీ.. కావాలంటే.. కాలేజీలు మూసేసుకుంటాం కానీ… ప్రభుత్వం తగ్గించిన ఫీజులతో నడపలేమని తేల్చి చెబుతున్నాయి.
మెడికల్ డెంటల్ కళాశాలలు తమ కళాశాలల వద్ద నో అడ్మిషన్స్ అని బోర్డులు పెట్టాయి. తాము రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్య విశ్వ విద్యాలయానికి రాసిన లేఖలతో పాటు విద్యార్ధినీ, విద్యార్ధులను ఎందుకు చేర్చుకోలేకపోతున్నామో కూడా కళాశాలల నోటీస్ బోర్డులో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఫీజుల తగ్గింపు నిర్ణయం తీసుకుందని.. కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించనున్నాయి.