ఇప్పటికే ఇచ్చిన జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. ఈ పీఆర్సీ ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రెండు సార్లు విచారణ వాయిదా పడింది. ఇవాళ డివిజనల్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ ఆర్సీ చట్ట విరుద్ధమని వాదించారు. పీఆర్సీ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీని బయటపెట్టలేదన్నారు. ఈ పీఆర్సీలో ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలని ఉందని పేర్కన్నారు. ఇది చట్ట విరుద్ధమని ఆదేశించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఇచ్చిన జీతాలను రికవరీ చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఏ ఒక్కరి నుంచి కూడా రికవరీ చేయవద్దని ఆదేశించింది. పీఆర్సీలో ఫిట్మెంట్ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.
అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడీ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఉద్యోగులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది.