హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని.. అక్కడే ఉండేలానేది ఏపీ ప్రభుత్వ అభిమతమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ లాయర్ చెప్పడంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృత చర్చ జరగుతోంది. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు హైకోర్టు అంశంపైనా విచారణకు వచ్చింది. హైకోర్టుకు ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారని జస్టిస్ జోసెఫ్ అడిగారు. రూ. 150 కోట్లు కేటాయించారని..ఇప్పటి వరకూ రూ. 116 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వ లాయర్ తెలిపారు. ఆ సమయంలోనే హైకోర్టు ఎక్కడ ఉండాలనుకుంటున్నారని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అమరావతిలోనే ఉంటుందని..ఉండాలని ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుందని చెబుతోంది. అయితే ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. చట్టం చేయడం ద్వారా హైకోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించలేరు. అది కేంద్రం.. సుప్రీంకోర్టు.. హైకోర్టుల ద్వారా జరగాల్సిన నిర్ణయం. దానికో ప్రక్రియ ఉంటుంది. చట్టం చేయడం అంటే.. కోర్టులను నిర్దేశించడమే. అలా ఎలా చేస్తారన్న డౌట్ సుప్రీంకోర్టుకు వస్తుందనే.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పారని అంటున్నారు.
కారణం ఏదైనప్పటికీ.. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే.. చట్టాలతో పని లేదు. ప్రభుత్వమే ప్రోసీడ్ కావొచ్చు. హైకోర్టు ద్వారా ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం పంపలేదు. కానీ కర్నూలులో హైకోర్టును అడ్డుకుంటున్నారంటూ రాజకీయం మాత్రం చేస్తోంది. ఈ రాజకీయంలో కోర్టుల్నీ భాగస్వామ్యం చేస్తున్నారని.. ఈ రోజు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు చెప్పడం ద్వారా తేలిపోయిదంన్న ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంపై వస్తున్నాయి.