వైసీపీ నేతలు ఐదేళ్లు కాళ్లు పట్టేసుకున్నారు. అడగకపోయినా మా మద్దతు మీకే అని ఎగబడ్డారు. కానీ బీజేపీ అగ్రనేతలు కనీసం తాము వైసీపీని ఎప్పుడూ మిత్రులుగా చూడలేదని తేల్చేశారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేశారు. ఈ పరిణామాన్ని ఆపడానికి చేయని ప్రయత్నమే లేదు. తామే గెలుస్తామని .. సంపూర్ణంగా మద్దతు ఇస్తామని బీజేపీ అగ్రనేతలకు రాయబారం పంపినా ప్రయోజనం లేకపోయింది.
గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రజలను వంచించిందని .. ఆ పార్టీ మళ్లీ గెలిచే అవకాశం లేదని ప్రధాని మోదీ తెలుగు మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లో కుండబద్దలు కొట్టారు. సంక్షేమం పేరుతో డీబీటీ పథకాలనే నమ్ముకోవడం, అభివృద్ది, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన విషయంలో పెద్దగా పురోగతి చూపించకపోవడం, విపక్షాల పట్ల దురుసుతనం, రాజకీయాల్లో అసభ్యమైన మాటల దాడి సంస్కృతిని తేవడం, వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా వ్యవహరించడంతో జగన్ నుప ప్రజలు ఆదరించరని.. అర్థమైపోయింది.
దక్షిణాదిన ఈ సారి మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంతో బీజేపీ ఏపీలో కూటమి కట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ సారి దక్షిణాదిలో అత్యధిక సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో అదే నిజమని తెలుస్తోంది. ఏపీ విషయంలో బీజేపీ వ్యూహాకర్తలు పక్కా వ్యూహం పాటించారని అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో రిజల్ట్ ఒరియంటెడ్ స్నేహాలే ఉంటాయని నిరూపిస్తున్నారని అనుకోవచ్చు.