ఏపీ ప్రభుత్వం సలార్ సినిమా టిక్కెట్ రేట్లను నలభై రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నలభై లెక్కేమిటో సాధారణ ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు యాభై రూపాయుల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సలార్ ఇంకా భారీ బడ్జెట్ సినిమా. ఓ వేళ ఇస్తే.. ఆ సినిమాకే ఎక్కువ హైక్ ఇవ్వాలి. కానీ తేడా చూపించారు. అసలు ఏపీ సర్కార్ టిక్కెట్ రేట్ల పెంపు కోసం పెట్టుకున్న రూల్సేమిటి ? అమలు చేస్తున్న విధానమేంటో ఎవరికీ అర్థం కాదు .
టాలీవుడ్ మొత్తం తన కాళ్ల వద్దకు రావాలన్నట్లుగా గతంలో టిక్కెట్ రేట్లపై జగన్ రాజకీయం చేశారు. ఐదు రూపాయల టిక్కెట్ పెట్టారు. టిక్కెట్ రేట్లు కోర్టు జోక్యం చేసుకోవడంతో సవరించారరు. ఆ సమయంలో టిక్కెట్ రేట్లను భారీ బడ్జెట్ సినిమాలకు పెంచేందుకు అనుమతి ఇస్తామని కొన్ని రూల్స్ తీసుకు వచ్చారు
హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే, 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెద్ద సినిమాలకు మాత్రమే ఐదో షో డిమాండ్ ఉంటుంది. కానీ ప్రభుత్వం చిన్న సినిమాలకు ఐదో షో చాన్సిచ్చింది. ఈ మేరకు రూల్స్ తో జీవో జారీ చేశారు.
కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క రూల్ కూడా అమలు చేయడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా పెంపుదలకు అనుమతి ఇస్తున్నారు. రేట్ల పెంపునకు అనుమతి పొందుతున్న ఒక్క సినిమా షూటింగ్ కూడా ఏపీలో జరగడం లేదు. వైసీపీ పెద్దలకు ఎంత ఎక్కువ కమిషన్ ఇస్తే అంత రేటు పెంపు కోసం పర్మిషన్ ఇస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.