పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా… తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరింతగా జోక్యం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగు రాష్ట్రాలు పరస్పరం .. ఆయన నదీ యాజమాన్య బోర్డులకు చేసిన ఫిర్యాదుల వివరాలను.. కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న దాదాపు పదిహేను ప్రాజెక్టుల వివరాలను… ఆయా నదీ బోర్డుల యాజమాన్యాలు కేంద్రానికి పంపాయి. ఎప్పుడు ప్రారంభించారు అనే దాని దగ్గర నుంచి ఎంత ఖర్చు చేశారు.. వాటి వల్ల సాగులోకి వచ్చిన భూమి ఎంత.. లాంటి వివరాలన్నీ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వాటికి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఉన్నాయా లేవా అని కూడా కేంద్రం ారా తీసినట్లుగా తెలుస్తోంది.
నిన్నామొన్నటి వరకూ.. పెద్దగా జల వివాదాలు లేని తెలుగు రాష్ట్రాలు హఠాత్తుగా… లేఖలు.,. ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించాయి. గతంలో తమ మధ్య సమస్యలను తామే పరిష్కరించుకుంటామని.. కేంద్రం జోక్యం అవసరం లేదని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొప్పగా చెప్పారు. కానీ.. వారే స్వయంగా నదీ యాజమాన్య బోర్డులకు.. జలశక్తి మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేయడంతో.. కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల వివరాలన్నింటినీ తీసుకుని… రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ముందుకెళ్లకుండా చేసే ప్రయత్నం చేయబోతందంటున్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయించారు.
కేంద్రం జోక్యం చేసుకుంటే.. రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు రిస్క్‌లో పడతాయి. ఎందుకంటే.. కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకుని మాత్రమే ప్రారంభించాలి. రెండు రాష్ట్రాల్లో గత ఆరేళ్లలో కట్టిన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు. అయితే.. అవన్నీ పాత ప్రాజెక్టులని ఆయా ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. కానీ తమవే పాతవి అని పొరుగు రాష్ట్రానివి కొత్తవని పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇప్పుడు వాటికి డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించాల్సి వస్తే.. కొత్తవో.. పాతవో తేలిపోతుందని అంటున్నారు. అదే జరిగితే.. రెండు రాష్ట్రాలూ.. తమ ప్రాజెక్టుల విషయంలో కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు.