” తెలంగాణలో సముద్ర తీరం లేదు, ఆయిల్ నిల్వలు లేవు. రిగ్గులు కొనేవాళ్లు లేరు. కానీ హైదరాబాద్‌లో పరిశ్రమ ఏర్పాటుకు డ్రిల్ మెక్‌స్పా ముందుకు వచ్చింది. ఆ సంస్థకు కృతజ్ఞతలు. దీని ద్వారా రిగ్గుల తయారీ హబ్‌గా తెలంగాణ గుర్తింపు పొందుతుంది…” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రిల్ మెక్ స్పా అనే కంపెనీ హైదరాబాద్‌లో పదిహేను వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ చేసుకుటూ వ్యాఖ్యలు చేశారు. ఈ డ్రిల్ మెక్ స్పా ఎవరిదో కాదు.. మెఘా గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న కంపెనీ.
మేఘా గ్రూప్‌కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు చేస్తోంది. అయితే ఒక్క తెలంగాణతోనే కాదు.. ఏపీతోనూ ఆ సంస్థకు పెద్ద ఎత్తున అనుబంధం ఉంది. టీడీపీ హయాలో పట్టి సీమ శరవేగంగా కట్టారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్‌లో మొత్తం ప్రధాన ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీకే దక్కాయి. కానీ పనులు ఎంత జరుగుతున్నాయో స్పష్టత లేదు. అయితే ఆ సంస్థ ఇప్పుడు రిగ్గుల పరిశ్రమ పెట్టాలనుకుంటే ఏపీలో పెట్టొచ్చు. ఎందుకటే సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. కావాల్సినంత ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. రిగ్గులకు ఎక్కడైనా అవసరం ఉందంటే.. అది ఏపీలోనే. కానీ పరిశ్రమమాత్రం మేఘా తెలంగాణలో పెడుతోంది.
మేఘా సంస్ధ ఇటీవల ఆయిల్ రిగ్గుల తయారీకి ఆసక్తి చూపుతోంది. ఇటీవల స్వదేశీ తయారీ రిగ్‌ను కూడా రూపొందించింది.అయితే ప్రత్యేకంగా డ్రిల్మెక్ స్పా తో టై అప్ కావాలని నిర్ణయించుకుంది. ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది. మేఘా భాగస్వామ్యంతో తెలంగాణలో ప్రారంభించి.. ఇతర చోట్ల మార్కెట్ వెదుక్కోనుంది ఈ సంస్థ.