కర్ణాటకలో ప్రగతిశీల సంచలన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య దేశంలో తీవ్రాగ్రహానికి దారి తీసింది. సంఘపరివార్ లేదా దాని అనుబంధ సంస్థలకు చెందిన వారు లౌకికవాదులను హేతువాద ఉద్యమ కారులపై దాడులు హత్యలు చేయడం ఇది కొత్తకాదు. గతంలోనూ కర్ణాటకలోనే మాజీ వైస్‌ఛాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, మహారాష్ట్రలో గోవింద పన్నారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్య చేశారు. హిందూత్వ సంస్థల ప్రతినిధులు దీని వెనక వున్నట్టు ప్రాథమిక దరాప్తులలో వెల్లడైంది. ఉపయోగించిన ఆయుధాలు బుల్లెట్టు కూడా ఒకే విధంగా వున్నట్టు అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు గౌరీ లంకేశ్ దారుణ హత్య కూడా ఆ కోవలో వుండటమే గాక ఈమె పాత్రికేయురాలుకావడంతో ఇంకా ఎక్కువ స్పందనకు కారణమైంది. గతంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కొన్ని వివాదాల్లో గౌరి చురుకైన పాత్ర నిర్వహించడం, బిజెపి మీడియా మొఘల్ ప్రహ్లాద్ జోషి స్వయానా ఆమెపై పరువు నష్టం దావా వేసి శిక్ష పడేలా చేయడం అందరికీ తెలుసు. ఆమె వివిధ పత్రికలలో మతతత్వాలకు వ్యతిరేకంగా రాస్తుంటారు కూడా. తనకు బెదిరింపులు వస్తున్నాయని కూడా చెబుతూనే వున్నారు.ఈ నేపథ్యంలో చూస్తే ఈ హత్య వెనక అవే శక్తులు వున్నాయని చెప్పక తప్పదు. హత్య తర్వాత కూడా మతతత్వ వాదులు ఆమెకు శాస్తి జరిగిందన్నట్టు వ్యాఖ్యలు పెడుతున్నారు. కర్ణాటకలో ఎలాగైనా ఆ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి అవకాశాలపై ఈ హత్య ప్రభావం పడకుండా వుండదు. అంతకంటే కూడా ఆందోళనకరమైంది హేతువాదులనే గాక సంపాదకులను కూడా వదలిపెట్టని విద్వేష శక్తులదాడులపై ఆలోచనా పరులెవరైనా ఆందోళన చెందకుండా వుండరు.