పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న షాకులకు ఏపీ సర్కార్ గుక్క తిప్పుకోలేకపోతోంది. ఏం చేయాలో పాలుపోక టెన్షన్ పడుతోంది. కేంద్రాన్ని నిందించలేక… రాజకీయంగా పోరాడలేక… ప్రభుత్వంలో ఉండి. ..ప్రతీ దాన్ని టీడీపీ మీద నెట్టేస్తే ప్రజలు చేతకాని వారనుకుంటారనే ఆందోళనతో.. ప్రభుత్వ పెద్దలు డబుల్ డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం… పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం బాధ్యతని చెప్పడం. అదే సమయంలో.. మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి.. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో వీరావేశతో మరో రకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం బాధ్యతని చెబుతూనే… కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.
పోలవరం విషయంలో కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నా… ప్రభుత్వం నోరెత్తడం లేదని తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి.. జలశక్తి మంత్రికి ఏడు పేజీల లేఖ రాశారు. మూడు రోజుల కిందటే రాసినట్లుగా ఉన్న లేఖను తాజాగా బయట పెట్టారు. అందులో పోలవరం ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తారాలను వివరించారు. విభజన చట్టంలో పోలవరం అంశాలను ప్రస్తావించారు. జాతీయప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదని… ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. అంచనాలు ఎందుకు పెరిగాయో కూడా జగన్ లేఖలో వివరించారు. నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఆమోదించిన అంచనాల ప్రకారమే నిధులు ఇవ్వాలని కోరారు.
మూడు రోజుల కిందట.. జగన్ రాసిన లేఖను మీడియాకు లీక్ చేసిన సమయంలోనే… జలవనరుల మంత్రి అనిల్ ప్రెస్‌మీట్ పెట్టారు. పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత.. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో ఉందిన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా.. ఇవ్వకున్నా 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని సవాల్ చేశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేంద్రం బాధ్యత అని చెప్పేందుకు బేస్ రెడీ చేసుకుంటోందని.. జగన్ లేఖ… మంత్రి అనిల్ ప్రెస్మీట్లతో తేలిపోతోందన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయడం కన్నా.. ఆ తప్పు.. తమ మీద పడకుండా చూసుకంటే చాలన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.