తొలి సినిమాతోనే ‘పటాస్’ లాంటి మాస్ హిట్ పేల్చాడు అనిల్ రావిపూడి. తర్వాత వరుసగా విజయాలు అందుకున్నాడు. ఆయన సినిమాలో ఫన్ అయినా… ఫ్రస్ట్రేషన్ అయినా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే.‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ‘ఎఫ్3’ సినిమాతో బిజీగా ఉన్న అనిల్ పుట్టిన రోజు రేపు (మంగళవారం ). ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. ఆయన చెప్పిన బర్త్ డే ముచ్చట్లు ఇవే.
సహాయ దర్శకుడి నుంచి టాప్ దర్శకుడిగా ఎదిగారు . వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ?
దర్శకుడిగా ఇది ఆరో బర్త్ డే, ప్రతి మెట్టు ఎక్సయింటింగా వుంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ బర్త్ డే స్పెషల్ ఏమిటంటే .. షూటింగ్ లోనే వుంటాను. మనం అంతా చాలా కష్ట కాలం దాటుకొని వచ్చాం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసేయడానికి ఒక రెండున్నగంటల వినోదం అందించే సినిమాగా ఉండబోతుంది ఎఫ్ 3. ఇది పక్కా.
సంక్రాంతి మిస్ అవుతున్నట్లు అనిపిస్తుందా ?
నిజమే, సంక్రాంతికి స్పెషల్ కనెక్షన్ వుంది నాకు. ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సినిమాలే. ఎఫ్ 3 వచ్చుంటే హ్యాట్రిక్ అయ్యేది. అయితే చాలా సినిమాలు వున్నాయి. సోలోగా రావాలి నిర్ణయించుకున్నాం, ఎఫ్ 3 వచ్చిన రోజే పండగ అని సర్దిచెప్పుకున్నాం(నవ్వుతూ )
ఎఫ్ 2 కి కొనసాగింపుగా ఉంటుందా ?
లేదు, ఇది డిఫరెంట్ కధ. డబ్బు చుట్టూ తిరుగుతుంది, అందులోనే బోలెడంత ఫన్ జనరేట్ చేశాం. అందరికీ కనెక్ట్ అవుతుంది. నిజానికి సీక్వెల్ అంటే చాలా అంచనాలు ఉంటాయి. చాలా ఆశించి జనాలు థియేటర్లకు వస్తారు. వాళ్లందరికీ ఒకటే మాట చెబుతున్నా – మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకుని రండి. వాటిని తప్పకుండా మా సినిమా అందుకుంటుంది.
అనిల్ రావిపూడి అంటే మేనరిజం గుర్తుకు వస్తాయి. ఇందులో కూడా ఉందా ?
ఇందులో డైలాగ్ మేనరిజాలు ఉండవు. అస్తమానూ అవే చేస్తే… అనిల్ రావిపూడి ఇవి మాత్రమే చేయగలడా? అనిపిస్తుంది. అందుకే ఈసారి కొత్తగా యాక్టివిటీ మేనరిజం గా చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుంది.
పాత్రలు ఎలా క్రియేట్ చేస్తారు ?
రియల్ లైఫ్ నుంచే. నేను చూసిన పాత్రలే. ఎఫ్ 3 లో అందరికీ కనెక్ట్ అయిన పాత్రలు వుంటాయి. అవి అదిరిపోతాయి
ఇందులో వెంకటేష్ కి రే చీకటి అని, వరుణ్ తేజ్ కి నత్తి అని బయట చెప్పుకుంటున్నారు..?
ఓహ్.. బయటకు వచ్చేసిందా..? నిజమే. వాళ్ల క్యారెక్టర్లని అలా డిజైన్ చేశాం. దాంతో కొంత వరకూ కామెడీ వర్కవుట్ అయ్యింది. అయితే కథంతా దానిచుట్టూ మాత్రం తిరగదు. వాటిని ఎంత వరకూ వాడుకోవాలో, అంత వరకే వాడాం.
చాలా మంది నటీనటులు వున్నారు. వాళ్లని ఎలా హ్యాండిల్ చేశారు?
మొదటిసారి అలసిపోయానని అనిపించింది. నాకెందుకో ఈవీవీ గారు గుర్తుకు వచ్చారు. అంతమందిని ఎలా హ్యాండిల్ చేసేవారో. చాలా కష్టం బాబోయ్. అయితే మా అదృష్టం కొద్ది అందరూ మంచివాళ్ళు దొరికారు. అర్ధం చేసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు.
పాన్ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తున్నారు ?
‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమానే. పాన్ ఇండియా కంటెంట్ వుంటుంది(నవ్వుతూ ). అదేంటో సినిమా చూసి మీరే చెప్తారు.
గాలి సంపత్ నిరాశ పరిచిందా ?
లేదు. ఒక ప్రయత్నం చేశాం. అనుకున్నంత ఫలితం రాలేదు. ఒక స్నేహితుడి కోసం సినిమా అది. దాని ఫలితంతో నేను ఓకే. నేను దర్శకుడిగా సినిమాలు చేస్తూ, మరొకరి సినిమాకి వెనుక ఉండి సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఆ విషయం నాకు గాలి సంపత్ తో అర్థమైంది.
బాలీవుడ్ ఆలోచనలు ఉన్నాయా ?
లేవు, ఇక్కడ నా కోసం ఓ కుర్చీ వేసి ఉంచారు. ఇక్కడే సుఖంగా వుంది, అక్కడి వెళితే ఇక్కడ చైర్ పోతుందనే భయం వుంది (నవ్వుతూ ). ఎఫ్ 2 చేయమని వాళ్లు అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు.
దిల్ రాజుతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది..? కధ పూర్తిగా విన్నారా ?
నేనే ఇంకా పూర్తిగా చెప్పలేదు. రెండు మూడు సీన్లు చెబుతానంతే. ఆయన సరే.. సరే అంటారు.
దిల్ రాజు కధ పూర్తిగా వున్నాకే సినిమా లాక్ చేస్తారు. మీది సెపరేట్ స్కూల్. ఎలా కుదిరింది ?
స్కూల్ ఏదైనా డబ్బులు వస్తున్నాయి కదా. అది చాలు కదా. నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బులు వచ్చాయి. ఆ నమ్మకంతోనే ఆ బాధ్యత నాకు వదిలేశారు.
రేమ్యునిరేషన్ పెంచారా మరి ?
బాగా పెంచారు. ఆ డబ్బులతోనే ఓ ఇల్లు కొనుక్కున్నా.
కొత్త సినిమా కబుర్లు ?
ఎఫ్ 3 పుర్తయిన తర్వాత బాలకృష్ణ గారి సినిమా మొదలౌతుంది. జూన్ లో షూటింగ్ కి వెళ్తాం,
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..